నల్లగొండ, ఆగస్టు 18 : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డి కాలనీ అతిచిన్న గ్రామం. 365 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామ పరిధిలో బట్టబోతుల గూడెం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ మీద ఆధారపడిన వారే ఎక్కువ.
గత ఎన్నికల ముందు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు పీఏసీఎస్‌లలో 189 మంది రైతులు సుమారు రూ.1.07 కోట్ల పంట రుణం తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడుతలుగా ప్రకటించిన రుణమాఫీలో 118 మంది రైతులకు రూ.87.70 లక్షల రుణమాఫీ జరిగినట్లు తెలుస్తుంది. పలు కారణాలతో మరో 71 మంది రైతులకు రూ.56.33 లక్షల రుణమాఫీ కాలేదు.
ఇందులో ఐఓబీ నుంచి 163 మంది, పీఏసీఎస్ నుంచి 26 మంది రైతులు రుణం తీసుకున్నట్లు సమాచారం. గత రెండు విడుతలుగా రైతులను మభ్యపెట్టిన కాంగ్రెస్ సర్కారు మూడో విడుతలో కూడా మాఫీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో ఇంత తేడా రుణమాఫీ జరుగుతుంటే పెద్ద గ్రామాలకు చెందిన రైతుల పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఈ విషయంపై ప్రభుత్వంతోపాటు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు నోరుమెదపకుండా ఒకరిమీద ఒకరు నెట్టేసుకొని కాలం గడుపుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో గ్రామానికి సగటున 71 మందికే రుణమాఫీ
సూర్యాపేట, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారు చేసిన రుణమాఫీ ఇంకా చాలా మంది రైతులకు కాలే దు. దాంతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 486 గ్రా మ పంచాయతీలు, 932 ఆవాసాలు కలిపి 1,418 ఉన్నాయి. మూడు విడుతలు కలిపి రుణమాఫీ అయిన రైతుల సంఖ్య 1,00,583 మంది. ఈ లెక్కన సగటున ఒక్కో ఊరికి 71 మంది రైతులకే రుణమాఫీ అయ్యింది. జిల్లాలో తొలి విడుతగా రూ.లక్ష లోపు 56,217 మంది రైతులకు రూ.282.98 కోట్లు, రెండో విడుతలో 26,437 మందికి రూ.250 కోట్లు, మూడో విడుతలో 17,870 మందికి రూ. 305 కోట్లు మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మూడు విడుతలు కలిపి 1,00,583 మంది రైతులకు మొత్తం రూ.837 కోట్టే మాఫీ అవుతున్నది. వాస్తవానికి జిల్లాలో సుమారు 2.35 లక్షల మంది రైతులకు రూ.రెండు లక్షల లోపు రుణాలు దాదాపు రూ.3వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన రుణమాఫీ అయ్యింది కొద్ది మందికి మాత్రమే అనేది తెలుస్తున్నది. నేడు ఏ గ్రామానికి వెళ్లి రుణమాఫీ అయిందా అని రైతులను ప్రశ్నిస్తే కొద్ది మంది మాత్రమే అయ్యిందని చెబుతున్నారు. చాలా మందికి రాలేదని, అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని అంటున్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతామని హెచ్చరిస్తున్నారు.
పలు కారణాలతో తిరస్కరణ..
రైతుల్లో ఇప్పటి వరకు జాబితా ఉన్న వారికే రుణమాఫీ వచ్చింది తప్ప ఇతరులకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని పలువురు వ్యవసాయ అధికారులు అంటున్నారు. రాని వారు తమ దగ్గరకు వస్తే సరైన కారణం కూడా వెబ్సైట్లో ఉండటం లేదనేదే వారు చెబుతున్న విషయం. కుటుంబ సభ్యుల వివరాలు లేవు, ఆధార్, బ్యాంకులో పేర్లు వేరేగా ఉన్నాయి, ఆధార్ కార్డు నంబర్ ఒకే కుటుంబంలో అందరికీ ఒకే నంబర్ కనిపిస్తుంది.. అనే కారణాల కనిపిస్తున్నాయి.
రూ.54వేలు కూడా మాఫీ కాలేదు
నాకు మా గ్రామంలో 1.16ఎకరాల భూమి ఉంటే దానికి సంబంధించిన పాస్ బుక్ పెట్టి నల్లగొండలోని ఐఓబీలో రూ.54 వేలు పంట రుణం తీసుకున్నాం. మొదటి విడుతలోనే మాఫీ అవుద్ది అన్నారు. అప్పుడు లిస్ట్‌లో పేరు కూడా వచ్చింది. కానీ మాఫీ కాలేదు. అదేంటని బ్యాంకుకు వెళ్లి అడిగితే ఐడీ నంబర్ తప్పు పడింది, అందుకే రాలేదు, అదే వస్తది పో అని వెళ్లగొట్టారు.
– సుంకరబోయిన యాదయ్య, రెడ్డి కాలనీ, నల్లగొండ
అధికారులు ఏం చెప్పడం లేదు
నేను 2.26 ఎకరాలకు సంబంధించిన పాస్ బుక్‌లు పెట్టి రూ.1.60లక్షల పంట రుణం తీసుకున్నా. చివరి విడుతలో అవుద్ది అనుకుంటే కాలేదు. బ్యాంకుకు వెళ్లే మాకు వచ్చేవరకు తెల్వదు అంటుండ్రు. వ్యవసాయ అధికారులను అడిగితే బ్యాంకులో అడుగమంటున్నరు.
-జిన్నె వెంకట్ రెడ్డి, రెడ్డి కాలనీ, నల్లగొండ మండలం
మా దగ్గర మాఫీ అయిన జాబితానే ఉంటుంది
మూడు లిస్టులకు సంబంధించి మా దగ్గర ఎంత మంది రైతులకు మాఫీ అయిందో డేటా వచ్చింది. కానీ ఏ రైతుకు ఎంత అయిందో, ఎవరికి కాలేదో అనే జాబితా మాత్రం రాలేదు. ఎంత రుణం తీసుకున్నారు అనేది కూడా బ్యాంకర్ల దగ్గర ఉంటుంది. రాని వాళ్లు దరఖాస్తు చేసుకుంటే నోడల్ అధికారులుగా ఉన్న నేను వెరిఫై చేసి సరి చేసి ప్రభుత్వానికి పంపిస్తా.
-శ్రీనివాస్, ఏఓ, నల్లగొండ
ఫైనల్ డేటా వచ్చేదాక చెప్పలేం
మా దగ్గర ఎంత మంది రైతులు రుణం తీసుకున్నారు అనే జాబితా ఉండదు. అది డైరెక్ట్‌గా హెడ్ ఆఫీస్ నుండే ప్రభుత్వానికి వెళ్తుంది. మూడు విడుతల్లో మాఫీ పూర్తిగా అయిన తర్వాత ఎంతమందికి ఫైనల్‌గా మాఫీ అయిందనే డేటా వస్తుంది. ఇప్పడు ఎవరికి ఎందుకు రాలేదనేది మాత్రం చెప్పలేం.
-సుధీర్, ఫీల్ట్ ఆఫీసర్, ఐఓబీ నల్లగొండ