యాదగిరిగుట్ట, ఆగస్టు 20 : రుణమాఫీ విషయంలో యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేటకు దోఖా జరిగింది. దాదాపు 50 శాతం మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో మేమేం పాపం చేశామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న రుణం మాఫీ కాకపోవడం, పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో కాంగ్రెస్ సర్కారు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలో 1,429 మంది రైతులు ఉండగా 3,674 ఎకరాల భూమి సాగులో ఉంది. 90 శాతం మంది వివిధ బ్యాంకుల్లో రుణం తీసుకోగా సగానికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదు.
నేను మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. గతేడాది బ్యాంకులో లక్షా 60 వేలు పంట రుణం తీసుకున్నా. అందరికీ రుణమాఫీ జరుగుతుందని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన రోజే రుణమాఫీ చేస్తామని చెప్పి 9 నెలలు గడిపింది. ఇప్పుడు అరకొరగా రుణమాఫీ చేసింది. 2 లక్షల లోపు రైతులకు మూడో విడుత రుణమాఫీ చేస్తామని చెప్పినా నా పేరు జాబితాలో రాలేదు. మేం రైతులం కాదా? ఈ ప్రభుత్వానికి రైతులాగా కనిపించడం లేదా? మా ఊళ్లో చాలామందికి రుణమాఫీ కాలేదు.