నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ);వరి పోరు పతాక స్థాయికి చేరింది. ఈ నెల 4 నుంచి మొదలైన ఉద్యమ పోరు నిరాటంకంగా సాగుతున్నది. ఓ వైపు గులాబీ దళం మరోవైపు రైతాంగం వరి కంకులను చేతబూని ఆందోళన బాట పట్టాయి. ఇదే స్ఫూర్తితో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు తమ ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నినాదాలతో హోరెత్తించారు.
సూర్యాపేటలో తన ఇంటిపై ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఇండ్లు, క్యాంప్ కార్యాలయాలపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన ప్రకటించారు. పట్టణాలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు ఎగుర వేసి, బైక్ ర్యాలీలు తీసి కేంద్రం తీరును ఎండగట్టారు. అన్నదాతల ఉసురుపోసుకుంటే బీజేపీకి పతనం తప్పదని, రైతులు పండించిన వడ్లు కొనేదాకా సీఎం కేసీఆర్ సారథ్యంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్షలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. నేడు, రేపు ఢిల్లీకి తరలివెళ్లనున్నారు.
వరి పోరు పతాక స్థాయికి చేరింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో ఈ నెల 4న మొదలైన ఉద్యమం నిరాటంకంగా సాగుతున్నది. ఓ వైపు గులాబీ దళం.. మరోవైపు రైతాంగ బలం.. వరి కంకులను చేతబూని ఆందోళన ఉధృతం చేశారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన గళం వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనంచేసి నిరసనను హోరెత్తించారు. నిరసనల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్రావు, చిరుమర్తి, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, కంచర్ల, నోముల భగత్ పాల్గొన్నారు.