సూర్యాపేట, అక్టోబర్ 15 : మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రెండో దశ నిర్మాణంలో భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి పోరాటం గొప్పదని, శ్రీరాంసాగర్ రెండో దశకు ఆయన పేరు పెట్టాలని సూర్యాపేట న్యాయవాదులు బుధవారం స్థానిక భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య మాట్లాడుతూ.. శ్రీరామ్ సాగర్ రెండోదశ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి విశేష కృషి చేశారన్నారు. ఆయన కృషితోనే నేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు.
భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి 2008లో మరణించగా నాడు సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సురవరం సుధాకర్‌రెడ్డి, ధర్మభిక్షం, జానారెడ్డి పాల్గొనగా మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్వయంగా శ్రీరాంసాగర్ రెండోదశకు భీఎన్ పేరు పెట్టాలన్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా శ్రీరాంసాగర్ రెండోదశకు ఆర్డీఆర్ (రాంరెడ్డి దామోదర్‌రెడ్డి) పేరు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయమై పునారాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట న్యాయవాదులు చిప్పలపల్లి చిరంజీవి, చీదేటి వెంకటరెడ్డి, జిలకర చంద్రమౌళి, మోదుడు వెంకటరెడ్డి, కాకి రాంరెడ్డి, డి.నారాయణ, రెగట్టి లింగయ్య, వరకుప్పల వెంకన్న పాల్గొన్నారు.