నీలగిరి, జూలై 19 : నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నల్లగొండ ఎస్పీ శరత చంద్ర పవార్‌ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఐదేండ్లు ప్రశాంతంగా ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు కావాలని అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేసి గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నకిరేకల్ మండలంలోని తాటికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మనోహర్‌రెడ్డి ప్రశ్నించినందుకు మాజీ సర్పంచ్, అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.
ఈ విషయమ్తై బాధితుడు నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోగా అతడిపైనే కేసులు చేస్తామని బెదిరించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో వేదింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపర్తి గ్రామంలో ఓ భూమి విషయంలో గోర్ల భిక్షమయ్యకు, ఎమ్మెల్యే గన్‌మెన్‌కు వివాదం తలెత్తింది. ఈ వివాదంపై భిక్షమయ్య పోలీసులను ఆశ్రయించగా ప్రత్యర్థి ఎమ్మెల్యే గన్‌మెన్ కావడంతో సమస్యను పోలీసులు సంవత్సరం నుండి పట్టించుకోవడం లేదని తెలిపారు. మండలాపురంలో ఏర్పుల నాగమ్మ, వల్లభాపురం గ్రామంలో మాద రమేశ్, కడపర్తి గ్రామంలో గోర్ల మహేశ్‌కు చెందిన పలు సమస్యలు నెలల తరబడి పోలీస్ స్టేషన్లలలో మగ్గుతున్నాయని ఆరోపించారు. వీటిపై జిల్లా ఎస్పీ స్పందించి నకిరేకల్ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చిరుమర్తి లింగయ్య కోరారు.