రామగిరి, జూలై 6 : విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతిఏటా మిలియన్ మైండ్స్ అగ్యుమెంటింగ్ నేషనల్ ఎసిస్పిరేషన్స్ అండ్ నాలెడ్జ్ (ఇన్స్పైర్ అవార్డు-మానక్) నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ – ఇండియా అవకాశాన్ని కల్పిస్తున్నది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను ప్రయోగశాల వైపు ప్రోత్సహిస్త్తున్న సర్కారు.. ఇందులో పాల్గొనేందుకు ఆగస్టు 31వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,744 ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు అర్హత ఉన్నది. కాగా.. రెండేండ్లుగా ఇన్స్పైర్ అవార్డు మానక్ నామినేషన్స్ (దరఖాస్తుల) నమోదులో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుండటం గమనార్హం. అదే స్ఫూర్తిని కొనసాగించేలా ఇప్పటికే ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ అవార్డు – మానక్‌పై ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు, సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేస్తున్నారు.
విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఇన్స్పైర్ అవార్డు – మానక్ కింద వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల నుంచి వచ్చిన లక్ష ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఒక్కో దానికి ఖర్చుల కోసం రూ.10 వేలు విద్యార్థి ఖాతాలో జమ అవుతాయి. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుల్లో పది శాతం రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వాటిలో పది శాతం జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలిచే 60 నమూనాలను రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. ఒక్కో జాతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.20వేల నగదు పురస్కారం అందిస్తారు.
సృజనాత్మకతను వెలికి తీసేందుకు..
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని శాస్త్ర, సాంకేతిక విభాగం (డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఇన్స్పైర్ అవార్డు-మానక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయమైన సృజనాత్మకతను వెలికితీసి ప్రయోగాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సాహమిస్తున్నది. 6నుంచి 10వ తరగతి విద్యార్థులు ప్రాజెక్టుల కోసం నామినేషన్స్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆమోదంతో, గైడ్ టీచర్ సహకారంతో www.inspireawards-dst.gov.in ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. 2023-24 సంవత్సరానికి భారత ప్రభుత్వ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల నుంచి 10 లక్షల ప్రాజెక్టుల ఆలోచనలు రావాలని సంకల్పించారు. వాటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఆయా విద్యార్థులకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ప్రాజెక్టులు తయారు చేయించాలని నిర్ణయించారు.
రెండేండ్లుగా రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఫస్ట్
ఇన్స్పైర్ అవార్డు – మానక్ ప్రాజెక్టుల నమోదులో రెండు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ముందు వరుసలో ఉండేలా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను చైతన్యం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇన్స్పైర్ మానక్ అవార్డుల నమోదుకు ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 1, 744 ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో అర్హత ఉన్న పాఠశాలలు 841, సూర్యాపేటలో 549, యాదాద్రి భువనగిరి జిల్లాలో 354 పాఠశాలలు ఉన్నాయి.
దరఖాస్తులు చేసుకోవాలి
విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు చక్కటి అవకాశం ఇన్స్పైర్ అవార్డు- మానక్. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో భాగంగా ప్రాజెక్టులను నమోదు చేసుకోవాలి. డీఈఓ ఆదేశాలతో అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి చైతన్యం చేస్తున్నాం. 2023-24 విద్యా సంవత్సరం ప్రక్రియ మే నెలలో ప్రారంభం కాగా ఆగస్టు 31తో ముగుస్తుంది. ప్రాజెక్టుల నమోదులో రెండేండ్లుగా అత్యధికంగా దరఖాస్తులు చేసిన జిల్లాగా రాష్ట్రంలో నల్లగొండ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నది. సారి కూడా అందరి సహకారంతో నల్లగొండను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేస్తాం. చివరి గడువులోగా విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ప్రతిభ చూపేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు స్పందించేలా కృషి చేసి ప్రోత్సహిస్తాం.
– వనం లక్ష్మీపతి, జిల్లా సైన్స్ అధికారి, నల్లగొండ