యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహ స్వామి ఆలయంలో శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకలో భక్తులు పాల్గొని తిలకించారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభువుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. స్వామి వారిని సుమారు 10వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.18,24,515 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారి రాజన్‌బాబు స్వామివారి ప్రసాదం అందించారు.