యాదగిరిగుట్ట, జూన్11: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదిక పై ఆసీనులను చేశారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చనను పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు కొనసాగించారు. తెల్లవారు జామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలోని కల్యాణ మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హవనం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణపుష్పార్చన చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి వేళలో తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. స్వామి, అమ్మవార్ల శయనోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.