ఆలేరురూరల్, అక్టోబర్ 14 : ఎంతో కష్టపడి నీట్లో ఎంబీబీఎస్ సాధించినా ఫీజు చెల్లించేందుకు స్థోమత లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ చేయూతనందించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కాల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి గౌరి నీట్లో మంచి ర్యాంకు సాధించింది. కానీ, చదువుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని మీడియా, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నది.
విషయం తెలుసుకున్న అమెరికాలో స్థిరపడ్డ మండలంలోని శారాజీపేట గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ దూడల వెంకట్‌గౌడ్ ఆమెకు చదువుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. సోమవారం తన తండ్రి దూడల రవీందర్‌గౌడ్‌ను హైదరాబాద్‌కు పంపి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా రూ.లక్షన్నర చెక్కును గౌరి, ఆమె తల్లిదండ్రులకు అందిం చారు. ఈ సందర్భంగా వెంకట్‌గౌడ్ చొరవను కేటీఆర్ అభినందించారు. గౌరి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.