చండూరు, మార్చి 12 : నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కొరటికల్-శిర్దపల్లి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. బుధవారం చండూరు మండల పరిధిలోని శిర్దపల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్డుకు రెండుసార్లు శంకుస్థాపనా మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. అద్వాన్నంగా ఉన్న రోడ్డుతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందన్నారు.
ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సు నల్లగొండ నుండి వయా గూడపూర్, కొరటికల్, శిర్దపల్లికి చేరుకునే విధంగా అలాగే చండూరు నుండి శిర్దపల్లి, కొరటికల్, గూడపూర్, నల్లగొండకు పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలైన సోలిపురం, తాస్కానిగూడెం, బోడంగిపర్తి, దుబ్బకాల్వ గ్రామాలకు బీటీ రోడ్డును త్వరగా పూర్తి చేయాలన్నారు.
శిర్దపల్లిలో సుమారుగా 60 మంది అర్హులు పింఛన్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుల కోసం120 మంది, ఇందిరమ్మ ఇండ్ల కోసం 120 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వీరందరికి ప్రభుత్వం వెంటనే పింఛన్లు, రేషన్‌కార్డులు అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, పార్టీ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, వెంకటేశం, ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి పాల్గొన్నారు.