‘సీఎం కేసీఆరే మా భరోసా. ఆయనపైనే మాకు విశ్వాసం. ప్రజలకు గులాబీ దళపతే శ్రీరామరక్ష. కేసీఆర్ సార్
సారథ్యంలో హ్యాట్రిక్ విజయం పక్కా. ఆదివారం ఆలేరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశాం. 50వేల మందికి పైగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నరు. ప్రజలే మా బలం, బలగం. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ఆలేరు ఆడబిడ్డను నేనే..మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధికి తోడ్పాటును అందించండి’ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం కేసీఆరే మా భరోసా. ఆయన సారథ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించడం పక్కా. ఆదివారం ఆలేరులో ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశాం’ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే..
ఈ నెల 29న ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నాం. పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభ ఉంటుంది. 40 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. గత రెండు దఫాలుగా ఇక్కడే సభను నిర్వహిస్తున్నాం. మూడోసారి కూడా సెంటిమెంట్‌తో ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం.
సభకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బహిరంగ సభ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు సార్లు పరిశీలించాం. 50వేల కుర్చీలు వేయిస్తున్నాం. మైదానం పక్కనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశాం. హెలీప్యాడ్‌ను అధికారులు సైతం పలు సార్లు పరిశీలించారు. చలికాలం నేపథ్యంలో ఒక వేళ చీకటి పడినా ఇబ్బంది లేకుండా ముందస్తుగా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సభలో ఎల్ఈడీ స్క్రీన్లు పెడుతున్నాం. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాం.
ఇటీవల అన్ని మండలాల కీలక నేతలతో సమావేశం నిర్వహించాం. మహిళా నేతలతో భేటీ అయ్యాం. మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ప్రజా ఆశీర్వాద సభకు ఆహ్వానిస్తారు. జన సమీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. గ్రామాలవారీగా ఇన్చార్జీలను నియమించాం.
సంస్థాగతంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేని విధంగా బలంగా నిర్మాణమైంది. 80వేల పైచిలుకు బీఆర్ఎస్ సభ్యత్వంలో రాష్ట్రంలోనే ఆలేరు నాలుగో స్థానంలో ఉంది. అన్ని కమిటీల పునర్నిర్మాణం కూడా చేశాం. విద్యార్థి, యువత, సోషల్ మీడియా తదితర కమిటీలన్నీ గ్రామీణ స్థాయిలో ఉన్నాయి.
కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలవుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంట్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, దళిత బంధు పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చాం. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, మెడికల్ కాలేజీ, మూడు మినీ ట్యాంక్ బండ్లు, తుర్కపల్లి ఇండస్ట్రియల్ పార్కు, రోడ్లు, బునాదిగానీ కాలువను నిర్మించాం. సొంత నిధులు ఖర్చు పెట్టి డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. స్వచ్ఛందంగా సేవాకార్యక్రమాలు చేపడుతున్నాం. కేసీఆర్ కృషి వల్లే నియోజకవర్గంలో కరువు పోయి.. పచ్చని పొలాలతో అలరారుతున్నది. మరింత అభివృద్ధిపై సీఎంకు నివేదిస్తాం.