యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యార్థులు, యువతకు క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక క్రీడలకు దూరమయ్యారు. ప్రోత్సాహమిస్తే గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించగలరని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. దాంతోపాటు స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆయా మండలాలకు కిట్లు చేరగా.. త్వరలో గ్రామపంచాయతీలకు పంపిణీ చేయనున్నారు. దీంతో యువత, క్రీడాకారులకు ప్రయోజనం చేకూరనున్నది.
స్పోర్ట్స్ ఉండే ఆట వస్తువులు..
కేసీఆర్ స్పోర్ట్స్ కిట్‌లో క్రికెట్ బ్యాట్, రెండు జతల బ్యాటింగ్ గ్లౌజులు, జత వికెట్ కీపింగ్ గ్లౌజులు, రెండు జతల బ్యాటింగ్ ప్యాడ్లు, ఒక జత వికెట్ కీపింగ్ లెగ్ గార్డ్లు, ఆరు బంతులు, రెండు జతల ఆర్మ్ గార్డులు, కిట్ బ్యాగ్, నాలుగు సింథటిక్ వాలీబాల్స్, రెండు నెట్లు, ఒక సైకిల్ పంపు. మూడు సెట్ల డంబెల్స్ (2.5కిలోలు, 5కిలోలు, 7.5కిలోలు), మెజరింగ్ టేపు, డిస్కస్‌తో 1.2 కిలోలు, ఆరు టెన్నికాయింట్ రింగ్స్, నాలుగు స్కిప్పింగ్ తాళ్లు, మూడు ప్లాస్టిక్ విజిల్స్, ఒకటి స్టాఫ్ అండ్ గో వాచ్, 75 క్రీడా టీ షర్టులు ఉన్నాయి.
మునుగోడు మండలానికి 33 కిట్లు..
మునుగోడు మండలంలో 27 గ్రామపంచాయతీలు, 66 ఆవాస గ్రామాలు ఉండగా.. మండల వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో పాఠశాలల్లోనే ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా పరికరాలు సమకూర్చుతున్నారు. మండలానికి 33 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు మంజూరు కాగా.. యువజన క్రీడల శాఖ పర్యవేక్షణలో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాయి. త్వరలో యువతకు పంపిణీ చేయనున్నారు.
స్పోర్ట్స్ కిట్లు ఇవ్వడం సంతోషకరం
గ్రామీణ యువత, క్రీడాకారుల కోసం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉన్నది. క్రికిట్, వాలీబాల్ తదితర క్రీడల్లో యువకులు చాలా మంది సత్తా చాటుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు ఆడేందుకు ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం అందజేసే స్పోర్ట్స్ కిట్లు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
– పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్, మునుగోడు
త్వరలో కిట్లు పంపిణీ
ప్రభుత్వం మంజూరు చేసిన 33 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు మండలానికి చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తాం. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన పరికరాలను అందించడం వల్ల వారిలోని ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
– ఆర్.భాస్కర్‌గౌడ్, ఎంపీడీఓ, మునుగోడు