నీలగిరి, సెప్టెంబర్ 9 : పుట్టుక నీది.. చావు నీది బతుకంతా ప్రజలదని, తెలంగాణ మట్టి మనుషులను తన సాహిత్యం ద్వారా తట్టిలేపిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శపాయుడు కాళోజీ అని అన్నారు.
తెలంగాణ ప్రాంతంలోని ఎంతోమంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనికుడు కాళోజీ అని, ఆయన జీవితం దేశానికే ఆదర్శనీయమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం తన రచనల ద్వారా స్ఫూర్తిని కలిగించారని, యాస, భాష ద్వారా తెలంగాణ జాతిని చైతన్యం చేశారని చెప్పారు. అసమానతలు, అణచివేతలు, ఆధిపత్యాలకు కాళోజీ వ్యతిరేకమన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలు, ఆర్తికి అక్షర రూపం కాళోజీ అని అభివర్ణించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం ఝుళిపించిన కవితా మూర్తి కాళోజీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్‌యాదవ్, బొర్రా సుధాకర్, ఐసీడీఎస్ మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ కరీంపాష, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పార్టీ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్ మారగోని గణేశ్, కోఅప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్‌ఖాద్రి, గున్రెడ్డి యుగేంధర్‌రెడ్డి, పల్లె రంజిత్, నాయకులు రావుల శ్రీనివాస్‌రెడ్డి, తీగల జాన్శాస్త్రి, సయ్యద్ జాఫర్, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీరమల్ల భాస్కర్, కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు.