యాదాద్రి, మే 14 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9.30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు. అనంతరం లక్ష్మీసూక్త, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, నవకలశస్నపనం చేశారు. ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి లక్ష కుంకుమార్చన తంతును ఘనంగా నిర్వహించారు. ఉదయం 11గంటలకు కాళీయమర్ధనుడిగా స్వామిని అలంకరించి ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం జరిపించారు. రాత్రి 8గంటలకు హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకార సేవలో ఊరేగారు. పాతగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు శాస్త్రప్రకారం నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, సహాయ ఉప ప్రధానార్చకుడు మంగళగిరి నర్సింహమూర్తి, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్‌బాబు, దోర్భల భాస్కర్‌శర్మ, శ్రవణ్‌కుమార్, పాతగుట్ట ప్రధానార్చకుడు కొడకండ్ల మాధవాచార్యులు, అర్చకబృందం పాల్గొన్నారు.
సాయంకాలం కార్యక్రమాలు
ప్రధానాలయంలో సాయంత్రం 6గంటలకు నిత్య హవనాలు, సామూహిక పారాయణాలు, నృసింహ మూలమంత్ర హవనం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.
నేటితో ఉత్సవాలు ముగింపు
యాదాద్రి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయంలో ఉదయం 7గంటలకు మూలమస్త్ర హవనం, 9గంటల నుంచి 9.30గంటల వరకు పూర్ణాహుతి అనంతరం సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం 7గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థప్రసాద గోష్టి వంటి తంతును చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు.