నీలగిరి, జూలై 24 : జాతీయ రహదారి 565 నిర్మాణంలో నల్లగొండ పట్టణంలో పాట్లు, ఇండ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు సరైన న్యాయం చేయాలని, మార్కెట్ విలువ ప్రకారంగా నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ ప్రెస్ క్లబ్లో ఎన్‌హెచ్ 565 బైపాస్ మామిళ్లగూడ భూ బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పానగల్, ఆర్ణాలబావి ప్రాంతాల్లో మార్కెట్ విలువ గజానికి రూ.21 వేలు ఉంటే రూ.10,500 ఇచ్చారన్నారు. కానీ మామిళ్లగూడెంలో మాత్రం మార్కెట్ విలువ అదే రూ.21 వేలుంటే కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితుల మధ్యలోనే బేదాలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణంలో ఉన్న భూములన్నీ కోల్పోతున్నామని, వేరే ప్రాంతాల్లో భూములు కేటాయించాలని వారు కోరారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న ఒక్కగానొక్క భూమి పోతుంటే గుండె పగిలి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హౌసింగ్ బోర్డ్‌లో ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో గజం రూ.30 వేలకు అమ్ముడు పోయిందని, దానికి ఆనుకుని ఉన్న భూములు, తమకు మాకు మాత్రం రూ.5 వేలు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులతో, కలెక్టర్, ఆర్డీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భూమి పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భూ బాధితులు రమాదేవి, హాస్య, ఖాజా మొయినుద్దీన్, కార్తీక్, లింగయ్య, జాన్‌రెడ్డి, సతీశ్ రెడ్డి, సౌందర్య, పుష్పలత పాల్గొన్నారు.