నల్లగొండ ప్రతినిధి, జూలై 2(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బుధవా రం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు మైక్ దొరకలేదు. దీంతో నియోజకవర్గ సమస్యలను ఇన్చార్జి మంత్రితో పాటు జిల్లా మంత్రుల సమక్షంలో ప్రస్తావించాలని వచ్చిన ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. దీంతో ఇంతదానికే మీటింగ్ అంటూ ఇంత హడావుడి అవసరమా అంటూ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అలాగే మధ్యాహ్న భోజనం అనంతరం తలపెట్టిన ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి ఇద్ద రు ఎంపీలతో పాటు మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం గమనార్హం. దీంతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపించింది. ఇక సమీక్షా సమావేశం సైతం కలెక్టర్లు, మంత్రుల ప్రసంగాలతోనే ముగిసింది.
జిల్లా ఇన్ చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తొలిసారిగా ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం కోసం బుధవారం నల్లగొండకు వచ్చారు. వ్వవసాయం, విద్యుత్తు, ఇరిగేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, విద్య వైద్యం, భూభారతి, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, మహి ళా శక్తి పథకాలే ఎజెండాగా కొనసాగిన మీటింగ్‌కు జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉమ్మడి జిల్లా అధికారులు హాజరయ్యారు. అయితే సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభంకావడంతో ఎప్పుడు ముగించేద్దామా అన్నట్లుగానే సాగింది. ముందుగా కలెక్టర్లు జిల్లాల వారీగా చేపట్టిన అంశాలను వివరించగా వ్యవసాయం, వైద్యంపై జిల్లా అధికారులు చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించారు.
విద్యుత్తుపై ఏజెండా మొదలు కాగానే మంత్రులు సమావేశాన్ని హైజాక్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను త్వరగా వెళ్లిపోవాలనే ఆత్రుతలో ఇరిగేషన్‌పై మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని, ఈ నెల14న తిరుమలగిరి నుంచి కొత్త రేషన్‌కార్డులను సీఎం చేతులమీదుగా పంపిణీ ప్రారంభిస్తామని, జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిని ప్రస్తావిస్తూ వీటి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంలో ఉమ్మడి జిల్లా రోడ్లకు అధిక నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నల్లగొండ-మల్లేప ల్లి, దేవరకొండ-డిండి, చిట్యాల-భువనగిరి రోడ్ల నిర్మా ణం చేపట్టనున్నట్లు వివరించారు. ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. వీరికంటే ముందు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యను ప్రస్తావించాలని ప్రయత్నిస్తే వారికి మైక్ ఇవ్వడానికి మంత్రులు ఇష్టపడలేదు.
ఎస్ఈ కార్యాలయ ఓపెనింగ్ దూరం..
నల్లగొండలో ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయ ఓపెనింగ్ కు ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మెజార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సమావేశం నిర్వహణ పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజనం అనంతరం వెళ్లిపోయారు. నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉండడం విశేషం. రాజీవ్ పార్క్‌కు ఆనుకొని నిర్మించిన ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయాన్ని ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. దీనికి ఎమ్మెల్యేలు బాలునాయక్, సామ్యేల్, బీర్ల అయిలయ్య మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి హాజరైన మంత్రి ఉత్తమ్ ఆరోగ్యం బాలేదని ముందే వెళ్లిపోగా, భోజనానంతరం ఎంపీలు చామల కిరణ్, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం ఓపెనింగ్‌కే వెళ్లలేదు. ఇక ఎమ్మెల్యేల్లో సైతం జిల్లాకు చెందిన జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం హాజరుకాలేదు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ముందే వెళ్లిపోయారు. దీంతో ఒకరిద్దరూ ఎమ్మెల్యేలతో కలిసి ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి ఓపెనింగ్ చేయాల్సి వచ్చింది. ఇద్దరూ మంత్రులు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు బేఖాతర్ చేస్తూ డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేదని, ఇట్లా అయితే జిల్లాకు ఏం న్యాయం చేస్తారనే చర్చ స్థానికంగా మొదలైంది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎప్పటిలాగే సమావేశానికి దూరంగా ఉన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి కూడా మీటింగ్ రాకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యేల అసంతృప్తి..
చాలారోజుల తర్వాత జరుగుతున్న సమీక్షా సమావేశం కావడంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలని భావించారు. అయితే వీరిలో ఎవరికీ మైక్ దొరకలేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎవరికీ మైక్ ఇవ్వవద్దంటూ ముందే చెప్పారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యేల్, భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడాలని పదేపదే ప్రయత్నించి విఫలమయ్యారు. మైక్ ఇవ్వకుండా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఏమైనా ఉం టే తర్వాత తనను వ్యక్తిగతంగా కలవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఇబ్బందులు, రుణమాఫీ, విద్యుత్ సమస్యలు, సంక్షే మ పథకాలు, రోడ్లు, ఇరిగేషన్‌కు సంబంధించిన పలు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చేందుకు సిద్ధమై వస్తే మైక్ ఇవ్వకుండా చేశారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో మీటింగ్‌లు చూశామని, ఎన్నడూ ఇట్లా మైక్ ఇవ్వకుండా లేదని, మంత్రులు చెప్తే వినేందుకైతే మీటింగ్‌కు ఎందుకు అంటూ వాపోయారు.