హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా
ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానుల సమక్షంలో పరిపాలనా సౌధాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తనయుడు తోడు రాగా తండ్రికి పాదాభివందనం చేసి తన చాంబర్లో అడుగు పెట్టారు. వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌కు సంబంధించిన రూ.958.33 కోట్లను డిస్కమ్‌లకు ఇస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్‌రెడ్డికి ఉమ్మడి జిల్లా నేతలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యాపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో రాష్ట్ర నూతన సచివాలయ పూపారంభోత్సవం ఆదివారం తమ తమ చాంబర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆశీనులయ్యారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తనయుడు వేమన్‌రెడ్డి తోడు రాగా, తండ్రి రామచంద్రారెడ్డికి పాదాభివందనం చేసి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా చాంబర్లోకి ప్రవేశించి అధినేత సీఎం కేసీఆర్ పెట్టిన ముహూర్తానికి తొలి ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అందించే మొత్తంలో భాగంగా మే నెలకు సంబంధించి 958,33,33,000 రూపాయలను డిస్కంలకు మంజూరు చేస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారు.
చాంబర్ ప్రవేశ సంబురాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్పీడీసీఎల్ సీఎండీ డి.రఘుమారెడ్డి, టీఎన్పీడీసీఎల్ సీఎండీ డి.గోపాల్‌రావు మంత్రికి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు.