సూర్యాపేట, మార్చి 15 : గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు, అబద్ధాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడితే, దళిత స్పీకర్‌ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ కుట్రపూరిత చర్య అని సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు నల్లకుంట్ల అయోధ్య, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గొండ్రాల అశోక్, న్యాయవాదులు దావుల వీరప్రసాద్ యాదవ్, తలమల్ల హసేన్ అన్నారు. జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 10 ఏండ్లు మంత్రిగా ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎవరికీ ఎలాంటి భంగం కలగకుండా జగదీశ్ రెడ్డి వ్యవహరించినట్లు చెప్పారు.
కుటుంబానికి స్పీకర్ పెద్ద అని, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలనడాన్ని తప్పుపడుతూ కుట్రపూరితంగా బడ్జెట్ సమావేశాల వరకు సస్పెన్షన్ విధించడం తగదన్నారు. జగదీశ్‌రెడ్డి దళిత వ్యతిరేకి అని దళిత సంఘాలను ఉసిగొల్పి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగదీశ్ రెడ్డి విద్యార్థి ఉద్యమం మొదలు నేటి వరకు దళిత, బహుజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను ప్రస్తావించినందుకు ప్రజలు ఎక్కడ బీఆర్ఎస్ కు దగ్గర అవుతారో తమకెక్కడ దూరం అవుతారో అనే భావనతో కాంగ్రెస్ కుట్రపూరితంగా జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ విధించింన్నారు.
బీఆర్ఎస్కు దళితులను దూరం చేసి, జగదీశ్‌రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని, రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. వెంటనే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించడంతో పాటు న్యాయపరంగా పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు ఎండి లతీఫ్, మీలా రమేశ్, జేసీ చంద్రమౌళి, మీసాల శ్రీను, ఊట్కూరి సైదులు, చిప్పలపల్లి చిరంజీవి, ఆర్ శంకర్, తోగిటి మురళి పాల్గొన్నారు.