సూర్యాపేట, నవంబర్ 24: తెలంగాణ ఏర్పాటులో దీక్షా దివస్ కీలకమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యనేతల సన్నాహక సమావేశంలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని, ఆ రోజే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైందన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్ర మెడలు వంచిందని, ఆ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆమరణ దీక్షతో ఉద్యమం ఉవ్వెతున ఎగిసిపడిందన్నారు. అన్ని రంగాలు ఐక్యతతో కలిసి వచ్చాయన్నారు. ప్రతి ఏడాది బీఆర్ఎస్ దీక్షాదివస్‌ను ఘనంగా నిర్వహిస్తుందని, అందులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి దీక్షా దివస్‌కు ప్రజలు సిద్ధమవుతున్నారని మాజీమంత్రి పేర్కొన్నారు.
ఆదర్శంగా దీక్షా దివస్ నిర్వహించాలి
రాష్ర్టానికి ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్‌ను నిర్వహించుకుందామని మాజీమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వకున్నా వారు కష్టపడి ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి పండించిన పంటలను కొ నుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోల్మాల్ జరుగుతుందని, ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదన్నారు. మ్యాచర్ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండలేక దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని పేర్కొన్నారు. 2014కు ముందు రైతులు ఎలాం టి సమస్యలు ఎదుర్కొన్నారో.. అవే తిరిగి పునరావృతమవుతున్నాయన్నారు.
ప్రజలు, రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ ప్రజలు, రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసిందని, రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిండన్నారు. తెలిసే మోసం చేసి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా బీసీల పరిస్థితి ఉందని, బీసీ రిజర్వేషన్లు పెంచుతామని, ఉన్న రిజర్వేషన్లను పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే అనేక చోట్ల బీసీలకు జీరో రిజర్వేషన్లు రావడమే అందుకు నిదర్శనమన్నారు. బీసీల కోసం బీఆర్ఎస ఉద్యమిస్తుందని, బీసీలతోపాటు అన్ని రం గాల ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందన్నారు.
కేసీఆర్‌ను వదులుకున్నామనే భావన అందరిలో కలుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, హు జూర్‌నగర్ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్‌రావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు గండూరి ప్రకాశ్, ఉప్పల ఆనంద్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.