నేరేడుచర్ల, ఏప్రిల్ 04 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం యాసంగి పంట కోతలు ముమ్మరంగా సాగుతూ 50 శాతానికి పైగా పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదన్నారు. గత వానాకాలం పంటలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుకు ఇచ్చిన రూ.500 బోనస్ అమలు చేయకుండా బోగస్ పథకంగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ సీజన్లో ఎంత ధాన్యం కొనుగోలు చేసింది, రైతులకు చెల్లింపుల వివరాలు వెల్లడించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్ లపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సరైన సమాధానాలు చెప్పడం లేదని అన్నారు, మంత్రులు గాలిలో తిరుగుతూ గాలి మాటలు చెబుతూ కాలం వెలుబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు,
ప్రభుత్వం చేపట్టిన ప్రతి పని సక్రమంగా అమలు చేయక కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి నెలకొని అభాస పాలవుతుందన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ వివాదంతో దేశంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనాన్ని 7.50 శాతం పెంపొందించి వన సంపదను సృష్టించగా, ప్రస్తుత ప్రభుత్వం ఒకేరోజు 100 ఎకరాల్లో చెట్లను నరికివేసి పర్యావరణాన్ని దెబ్బతీసి చరిత్ర సృష్టించిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కాకుండా బంధుమిత్రులకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నాయకులను, విద్యార్థులను గృహ నిర్బంధాలు, అరెస్టు చేయడం అమానుషమన్నారు. పాలనలో విఫలమైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
మంత్రులు కాలేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధమని ప్రచారం చేస్తున్నారని, తాము ప్రాజెక్టుపై నిలబడి ప్రసంగించామని ఆ ప్రసంగాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని అలాంటప్పుడు కాలేశ్వరం అబద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు, ప్రభుత్వం అబద్ధాలు, మోసాలు, పోలీసు జులుంతో పాలన కొనసాగిస్తుందన్నారు. సంపాదనలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడుతున్నారని ఆరోపించారు, ఎన్నికలు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన మోసంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ జడ్పిటిసిలు అన్నపురెడ్డి నారాయణరెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, జీడి భిక్షం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీలు చెన్నబోయిన సైదులు, నెమ్మది భిక్షం, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు యల్లబోయిన లింగయ్యయాదవ్, చిత్తలూరి పెద్ద సైదులు, శ్రీహరి, మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, నాయకులు ఇంజమూరి రాములు, అనంతు శ్రీనివాస్ గౌడ్, వస్కుల సుదర్శన్, రాపోల్ నవీన్, చిట్యాల శ్రీనివాస్, శ్రీరామ్ మూర్తి, నందిపాటి గురువయ్య, గంట చిన్న మల్లారెడ్డి, కరణం నరసయ్య, మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, అరవింద్, భాస్కర్, లంకెపల్లి నాగార్జున, శంకర్ నాయక్, బుచ్చి రాములు, ఆరె సైదులు, వెంకట్, లకుమల్ల రవీందర్, కటికోల లక్ష్మీనారాయణ గౌడ్, మధు, కర్ణం నర్సయ్య, జానకిరాములు, శ్రీనివాసరావు, నవీన్ యాదవ్, శనగాని ఉస్మాన్, పల్ల అఖిల్ పాల్గొన్నారు.