నకిరేకల్, నవంబర్ 13 : రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు ఒక్క సెంటర్ కేటాయించకుండా మొత్తం కోఆపరేటివ్ సొసైటీలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించారని, కాంగ్రెస్ నాయకులు రైతుల శ్రమను, సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ధాన్యం తడిచి మొలకెత్తితే ఆ ధాన్యాన్ని కొనమని కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాలు, తేమ, మొలకల పేరుతో మిల్లర్లు అడ్డగోలుగా ఐదు నుండి పది క్వింటాళ్ల ధాన్యం తరుగు తీస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతుల నుండి ధాన్యం వెంటనే కొనుగోలు చేసి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ప్రదీప్ రెడ్డి, తరాల బలరాం, పల్లె విజయ్, గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, మరో వెంకటరెడ్డి, నోముల కేశవరాజు, పీర్ల కృష్ణ కాంత్, యానాల లింగారెడ్డి, గొర్ల వీరయ్య పాల్గొన్నారు.