పెన్పహాడ్, ఆగస్టు 09 : గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో ఎస్సారెస్పీ కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలను విడుదల చేయకపోవడం ఒకవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బోర్లు, బావులు ఇంకిపోతుండడంతో సాగు నీరందక వరి పైర్లు ఎండిపోతున్నాయి. పెన్పహాడ్ మండలం చిన్న సీతారం తండా, గాజుల మల్కాపురం, చెట్ల ముకుందాపురం, పెద్ద సీతారాంతండా, గుడెపుకుంట, నూర్జవన్పేట తండా, తదితర గ్రామాల్లో రైతులు అరిగోస పడుతున్నారు. పొలాలను, నారుమడులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళ సైతం వ్యవసాయ పొలాల వద్ద పడుకుని ఉన్న కాస్త నీటిని సర్దుబాటు చేసుకుంటున్నారు. దానికి తోడు కరెంట్ సరఫరాలో పదే పదే ట్రిప్ అవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలను మండలంలోని పలు గ్రామాలకు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటూ నిట్టూరుస్తున్నారు.
కాళేశ్వరం జలాలు వస్తాయనే ఆశతో 5 ఎకరాల్లో వరి నారు పోశా. బావిలో నీరు పూర్తిగా అడుగంటిపోవడంతో కనీసం నారుమడి కూడా పారడం లేదు. నారు ముదరడంతో పాటు నేలంతా నెర్రెలుబారింది. బావిలో కొద్దో గొప్పో ఊట వస్తే మోటారు పెట్టిన కొద్దిసేపటికే అయిపోతున్నది. ఇప్పుడు నీళ్లు లేక పంట ఎండిపోతే అప్పులపాలు కాక తప్పదు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించాలి.
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చేయి వేసుకుని భరోసాగా బతికినం. రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక, కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేకపోతున్నాం. కాళేశ్వరం నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ను పడావు పెట్టిన కాంగ్రెస్ సర్కారు నిర్వాకం రైతులకు శాపంగా మారింది.
Penpahad : సాగునీరు లేక ఎండుతున్న వరి పైర్లు