కోదాడ, జూన్ 25 : కిడ్నీ మార్పిడి చేయిస్తామని లక్షల్లో డబ్బులు గుంజుతున్న అంతరాష్ట్ర ముఠాను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫోర్జరీ సంతకాలతో బ్లడ్ శాంపిల్, డీఎన్ఏ టెస్ట్, తప్పుడు రిపోర్టు సృష్టించి లక్షల్లో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న పది మంది వ్యక్తుల ముఠాలో ఆరుగురిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్ నెలలో కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సత్తూరి నరేశ్‌కు విజయవాడలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయిస్తామని చెప్పి అధికారులతో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు స్టాంపులను సృష్టించి క్లియరెన్స్ సర్టిఫికెట్లకై రూ.22 లక్షలు ఒప్పందం కుదుర్చుకుని కిడ్నీ ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్‌కు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారని తెలిపారు.
విజయవాడలోని డయాలసిస్ సెంటర్లో కిడ్నీ బాధితుల బలహీనతను ఆసరా చేసుకుని ఈ తంతు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో కడుపూరి తాతారావు, కొండం రమాదేవి, బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబురావు, కందుకూరి విష్ణువర్ధన్, మహమ్మద్, సర్థార్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరందరూ శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడకు చెందిన వారిగా తెలిపారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారన్నారు. ఈ ఆరుగురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 7 సెల్ఫోన్లు, ఆరు రబ్బర్ స్టాంపులు, ఇంక్‌ప్యాడ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ శివకుమార్, కోదాడ పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్‌కుమార్, సిబ్బందిని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అభినందించారు.