గట్టుప్పల్, మే 15 : గట్టుప్పల్ మండల పరిధిలోని అంతపేట గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఇంటి స్థలం పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గతంలో నిరుపేదలకు ఇచ్చిన భూమిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ శ్రీదేవి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతపేట గ్రామంలో గతంలో నిరుపేదల ఇండ్ల స్థలాలకు సర్వే నంబర్ 6/ఉ లో పట్టాలు ఇచ్చారని, లబ్ధిదారులు తమ భూమి దగ్గరికి వెళ్తే అధికారులు అడ్డగిస్తున్నట్లు తెలిపారు. 1999లో అంతంపేట గ్రామంలో ఆనాటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి 150 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చినట్లు చెప్పారు.
కాగా ఆ స్థలంలో మౌలిక వసతులు లేకపోవడం వలన ఇండ్ల నిర్మాణం జరుగలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ స్థలంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, గట్టుప్పల మండల కార్యదర్శి భీమనపల్లి రమేశ్, గ్రామ శాఖ కార్యదర్శి అయితరాజు లక్ష్మయ్య, గూడెం నరసింహ, పెంటయ్య, అంతంపేట నాయకులు తెలుసూరి సైదులు, మాదగోని కోటమ్మ, సత్తమ్మ, నరసింహ, శ్రీరాములు పాల్గొన్నారు.