నల్లగొండ రూరల్, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ మండలం జి.చెన్నారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు.
వెంటనే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రెండు పూటలా ఫొటోలు తీసే విధానం రద్దు చేయాలని, పని ప్రదేశాలలో మెడికల్ కిట్టు, మంచినీటి సదుపాయం కల్పించాలని, గడ్డపారా, పారా, తట్టలు, ఇతర పనిముట్లు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రెండు పూటలా ఫొటోల విధానం రద్దు చేయాలని ఈ నెల 21 నుండి 25 వరకు అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా వల్కి భారతమ్మ, ఉపాధ్యక్షుడిగా గనిపెళ్లి అలీస్వామి, కార్యదర్శి దర్శనం రామదేవి, సహాయ కార్యదర్శి ఉప్పునూతల కవిత, కోశాధికారి మైలపాక జ్యోతిను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సునీత, ఉపాధి హామీ కూలీలు ఊశయ్య, సైదులు, జ్యోతి, మంగమ్మ, అలివేలు, విజయనిర్మల, లలిత పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి : నారీ ఐలయ్య