దేవరకొండ, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందుల కిట్లను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి మొదలు వృద్ధుల వరకు అందరికీ ఉచితంగా వైద్యం అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. మారుమూల తండాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో సైతం మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కృష్ణకుమారి, వైద్యశాఖ సిబ్బంది లింగయ్య, వడ్తి బాలు, బీఆర్ఏస్ నాయకులు బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మాల్ : ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని మహిళా శిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి అన్నారు. దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను మంగళవారం చింతపల్లిలో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులకు ప్రతి నెలా ప్రభుత్వ దవఖానల్లో ఉచితంగా మందులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, ఎంపీటీసీ సదానందం, మైనార్టీ నాయకులు ఎండీ ఖాలేద్, వైద్యురాలు శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం మండల కేంద్రంలో ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్ ప్రారంభించారు. అనంతరం కంటివెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఉపేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని పీహెచ్సీలో దీర్ఘకాలిక రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్సీడీ కిట్లను ఎంపీపీ అనుముల పాండమ్మ, జడ్పీటీసీ భారతి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, నిడమనూరు మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైద్యాధికారి రమావత్ శంకర్‌నాయక్, కోఆప్షన్ సభ్యుడు హుస్సేన్ పాల్గొన్నారు.
నాంపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఎన్సీడీ కిట్‌ను ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత పంపిణీ చేశారు. మండల వ్యాప్తగా 4800 ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.