బొమ్మలరామారం తాసీల్దార్ కార్యాలయం అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది. ఆస్తులను ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారు. చేతులు తడిపితే చాలు అడ్డగోలుగా భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఉదాహరణే మర్యాల గ్రామంలోని ఓ అక్రమ రిజిస్ట్రేషన్. తల్లి పేరు మీద ఉన్న భూమిని రెండో కొడుకుకు తెలియకుండానే.. మొత్తానికి మొత్తంగా పెద్ద కొడుకుకు భూమి రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. భూమిపై గతంలోనే వివాదం నడుస్తున్నా.. విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా రిజిస్ట్రేషన్ చేయడంపై అనుమానాలకు తావిస్తున్నది. గతంలోనూ ఇదే తరహా రిజిస్ట్రేషన్ జరిగిన దాఖలాలు ఉన్నాయి.
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామానికి చెందిన బండ ఎల్లమ్మ, ఎల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. ఎల్లయ్య కొంత కాలం కింద మరణించాడు. పెద్ద కుమారుడు బండ చెన్నయ్య, చిన్న కుమారుడు బండ శ్రీశైలం. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎల్లయ్య బతికి ఉన్నప్పుడు వారసత్వంగా వస్తున్న సొంత భూమిని అమ్మి అదే గ్రామంలోని సర్వే నంబర్ 583/అలో 2 ఎకరాల 12 గంటలు, 613/అలో ఒక ఎకరం 4గంటల భూమిని కొనుగోలు చేసి.. ఎల్లమ పేరుపై పట్టా చేయించారు.
రెండు సర్వే నంబర్లలో కలిపి 3 ఎకరాల 16గుంటల భూమి ఎల్లమ్మ పేరుపై ఉంది. ఆ భూమిలో అన్నదమ్ములు ఇద్దరు సమభాగాలు పంచుకొని.. కబ్జాలోకి ఉండి కొన్నేండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇద్దరు కొడుకులకు సమానంగా రావాల్సిన ఆస్తిని రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా ఒక్క కుమారుడికే కట్టబెట్టారు. చిన్న కుమారుడికి తెలియకుండా, ఎలాంటి కన్సెంట్ తీసుకోకుండా పెద్ద కుమారుడి పేరుపై ఈ ఏడాది మే 3న రెవెన్యూ అధికారులు 546/2024 నంబర్‌తో గిఫ్ట్ డీడ్ చేశారు.
వివాదం ఉన్నా..
ఇటీవల కాలంలో భూముల పంపకాల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడలు షురూ అయ్యాయి. తరుచూ పొలం వద్ద ఘర్షణలు చోటుచేసుకునేవి. భౌతికంగా దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే బొమ్మలరామారం పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ తాసీల్దార్ శ్రీనివాస్ రావు ఎదుట రెండు సార్లు బైండోవర్ చేశారు. ఈ భూమి వివాదం గురించి తాసీల్దార్ దృష్టిలో ఉంది. వివాదంలో ఉన్నా, బైండోవర్ చేసినా ఏక పక్షంగా ఒక్కరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయడంలో మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బైండోవర్ చేసిన నేపథ్యంలో అన్నదమ్ములు ఇద్దరు అంగీకార పత్రం సమర్పిస్తేనే పట్టా చేయాలనే నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా..
రిజిస్ట్రేషన్ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో చిన్న కుమాడు లబోదిబోమంటున్నాడు. తాసీల్దార్‌ను కలిసి తన గోడున వెల్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇద్దరం కొడుకులం ఉంటే ఒక్కరికే ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కలెక్టరేట్లో ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరుగలేదని బాధితుడు వాపోతున్నాడు. ఇదే విషయమపై బొమ్మలరామారం తాహసీల్దార్ శ్రీనివాస్‌రావును ఫోన్లో వివరణ కోరగా, ఈ అంశంపై తనకు ఐడియా లేదని దాటవేసే ప్రయత్నం చేయడం కొసమెరుపు. కాగా గతంలో మర్యాల గ్రామంలో ఓ వృద్ధురాలికి ముగ్గురుకు కొడుకులు ఉండగా, ఇద్దరికే రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో అది వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి సమానంగా పంచుకున్నారు.
నా వాటా నాకు ఇప్పించండి..
మా అమ్మకు ఇద్దరం కొడుకులం. ఒక్కరి పైనే ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు. తాసీల్దార్‌ను అడిగితే నేను అలానే చేస్తాను.. ఏం చేస్తావో చేసుకో పో.. లేదంటే కోర్టుకు వెళ్లమని బెదిరించాడు. కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వాలని అడిగిప్పుడు విచారణ సమయంలో చెప్పినట్లు వినకపోతే కేసు పెట్టి జైల్లో వేస్తామని బెదిరించారు. ఇది ఎంత వరకు సబబు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నాను. న్యాయబద్ధంగా రావాల్సిందే అడుగున్నాను. నా భూమి నాకు అప్పగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– బండ శ్రీశైలం, బాధితుడు, మర్యాల