నల్లగొండ ప్రతినిధి, జూన్18(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సి.నారాయణరెడ్డి తనదైన శైలిలో తొలిరోజే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం మండల స్థాయి అధికారులతో, మధ్యాహ్నం తర్వాత జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. జిల్లాలో ప్రజలకు సంతృప్తినిచ్చేలా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల అధికారులుగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పథకాల అమలులో చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.
పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం ఉంటుందని, పనిచేయని వారి పట్ల కూడా కఠిన చర్యలు తప్పవని సుతిమెత్తని హెచ్చరికలు తొలి రివ్యూల్లోనే జారీ చేశారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, జిల్లా అధికారులు వారంలో మూడు రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్గా హరిచందన స్థానంలో ఆదివారం బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి సోమవారం బక్రీద్ సెలవు కావడంతో మంగళవారం తన పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ‘టీమ్ నల్లగొండ’ అంటూ కొత్త ఫార్ములాతో అన్ని విభాగాల్లోనూ సమష్టి పనివిధానంతో రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేద్దామని జిల్లా అధికార యంత్రాంగానికి పిలుపునివ్వడం విశేషం.
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం నారాయణరెడ్డి మొదటిసారిగా జిల్లా అధికారులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లా అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్రతి శాఖ ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులపై ఆలోచన చేయాలని, వారంలో 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని, అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలులో ‘టీమ్ నల్లగొండ’ మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని, పథకాల అమలు విషయంలో ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో రాజీ పడవద్దని, నాణ్యమైన విద్యను అందించాలని, పదో తరగతి ఫలితాల్లో ప్రస్తుత ఒరవడిని కొనసాగించాలని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున యూరియా, ఎరువుల పంపిణీ సక్రమంగా జరుగాలని, నకిలీ విత్తనాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలులో అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వైద్య శాఖ పనితీరు సైతం ప్రజల మన్ననలు పొందేలా ఉండాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది హాజరు సక్రమంగా ఉండాలని, జిల్లాలో సాధారణ ప్రసవాలపై ఎకువ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. జిల్లా అధికారులను, మండలాల ప్రత్యేక అధికారులుగా నియమించామని, వారి శాఖల పనులతోపాటు, ఆయా మండలాలపై సైతం ఎకువ దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు.
ముఖ్యంగా ధరణి దరఖాస్తుల పరిషారంపై ముందుగా దృష్టి సారించాలని, ప్రతి సోమవారం మండలాల్లో నిర్వహించే ప్రజావాణిపై ప్రత్యేక సూచనలు చేశారు. ఎంపీడీఓ నోడల్ అధికారిగా తాసీల్దార్, ఎంపీఓ, ఏపీఎం, వ్యవసాయ అధికారి, ఎంపీడీఓలతోపాటు ఇతర మండల స్థాయి అధికారులందరూ ప్రజావాణిలో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఈ దరఖాస్తులను జిల్లా స్థాయి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కొనసాగాలని ఆదేశించారు. మండల స్థాయిలో 15 రోజులైనా పరిషారం కానీ ఫిర్యాదులను జిల్లా స్థాయికి పంపాలన్నారు. మండల స్థాయి ప్రజావాణి ప్రారంభిస్తున్న నేపథ్యంలో వచ్చే సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రకటించారు. సమావేశాల్లో ఆర్డీఓలు, జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.