మిర్యాలగూడ, డిసెంబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని హైదరాబాద్ రేంజ్ ఐజీ వి.సత్యనారాయణ అన్నారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేండ్లుగా నేరాలు పెరుగుతున్నాయని అదుపు కోసం పటిష్ట పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
మిర్యాలగూడ రూరల్ ఎస్హెచ్ఓను సీఐ స్థాయికి పెంచే విధంగా ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం, ఇసుక, గంజాయి, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో 24 బార్డర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రా నుంచి దళారులు కొంతమంది ఫామ్-10 ద్వారా మార్కెట్ సెస్ చెల్లించి ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చి ఐకేపీలో విక్రయించి రూ.500 బోనస్ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు 24 చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక టీమ్ పని చేస్తుందన్నారు. అంతుకు ముందు ఐజీ సత్యనారాయణకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు గౌరవ వందనం చేశారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐలు వీరబాబు, కరుణాకర్, ఎస్ఐలు లోకేశ్, కృష్ణయ్య, హరికృష్ణ, శేఖర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దామరచర్ల : మండలంలోని వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టును ఐజీ వీ సత్యనారాయణ పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద రికార్డులను తనిఖీ చేశా రు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యం లారీలను ఎట్టి పరిస్థితుల్లో నూ అనుమతించొద్దని ఆదేశించారు. 24 గంటలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ, డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ వీరబాబు ఉన్నారు.