చిట్యాల, అక్టోబర్ 19 : ఆనందంగా హోటల్‌ను ప్రారంభించుకుందామనుకున్న రోజే ఆ కుటుంబంలో విషాదం నిండింది. మృత్యురూపంలో వెంటాడిన దురదృష్టం కుంటుంబంలోని ఇద్దరిని మృత్యు ఒడిలోకి చేర్చింది. మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. సంఘటనకు సంబంధించి చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని మాడ్గులపల్లికి చెందిన తగుళ్ల వెంకన్న రైల్వే శాఖలో పని చేస్తున్నాడు. జీతం డబ్బులు సరిపోకపోవడంతో అదనపు ఆదాయం కోసం చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ నిర్వహించటానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెద్దకాపర్తి పెద్ద చెరువుని ఆనుకొని ఇటీవలే ఓ హోటల్ నిర్మించాడు. ఆదివారం హోటల్‌ను ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నెల 18న తన కుటుంబంతో అక్కడికి చేరుకొని రాత్రి వరకు హోటల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పూర్తి చేశాడు.
రాత్రి హోటల్లోనే ఓ రేకుల గదిలో అతని తల్లి పార్వతమ్మ, భార్య నాగరాణి(32), కుమారుడు విరాట్ కృష్ణ(7), కూతురు నందినిలతో కలిసి తానూ అక్కడే పడుకున్నారు. హోటల్ నిర్వాహణ కోసం అదే గదిపై రేకుల మీద 2 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారు ఆదివారం తెల్లవారుజామున ట్యాంక్ నిండి నీటి బరువుకు అది రేకులతో సహా పడుకున్న వారిపై కూలింది. దీంతో వారు తీవ్ర గాయాలపాలు కావటంతో వెంటనే నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాణి, విరాట్ కృష్ణ మృతి చెందారు. పార్వతమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. నందిని నార్కట్‌పల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.