నార్కట్పల్లి, జనవరి 27: ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరో రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. గట్టుపై భక్తులకు మౌలిక వసతుల, సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. దేవస్థానం విద్యుత్ దీపాల రంగులతో భక్తులను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. గుట్టపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఇరువైపులా రేలింగ్ సదుపాయాలు కర్రలతో కట్టారు. స్వామి దేవస్థానం విద్యుత్ వెలుగులతో ఉత్సవ శోభను సంతరించుకుంది.
భారీ బందోబస్తు
గట్టు కింద శివుడి రూపంలో విద్యుత్ రూపాలతో భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమయ్యే కొబ్బరికాయలు, 2 లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు అధికారులు సిద్ధ్దం చేయిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకోసం 6 గురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 76 మంది ఎస్ఐలు, 185 ఏఎస్ఐలు, 476 మంది కానిస్టేబుళ్లు, 101 మంది మహిళా కానిస్టేబుళ్లను ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నది.
నిత్యం 3 వేల మందికి నిత్యాన్నదానం
దేవస్థానంపై భక్తులకు శాశ్వత నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతి నిత్యం అన్నదానం చేపడుతున్నారు. ఈ పథకానికి దాతలు భారీ సంఖ్యలో ముందుకు వచ్చి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల మంది భక్తులు ఉచిత అన్నదానానికి శ్రీకారం చుట్టారు.
ఏర్పాట్లు పూర్తి..
ఉత్సవాల కోసం దేవస్థానంతో పాటు వివిధ శాఖలు ఏర్పాట్లను పూర్తి చేశాయి. ముఖ్యంగా పారిశుధ్యం గ్రామ పంచాయతీ తరపున అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించి చర్యలు చేపడుతున్నారు. వైద్య శాఖ రెండు బృందాలుగా ఏర్పడి గుట్టపైనా, కింద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం రోడ్డు పొడవునా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక పార్కింగ్
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాల కోసం గుట్ట కింద రెండు వైపులా దాదాపుగా ఎకరన్నర స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అధికంగా వసూళ్లు చేయకుండా ఏర్పాటు చేసిన ధరల పట్టికను చూసి వారిచ్చే రశీదు ప్రకారమే చెల్లించాలని అధికంగా వసూళ్లు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కల్యాణానికి హాజరుకానున్న ప్రముఖులు
పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్మించిన కల్యాణ మండపం చుట్టు పక్కల అభివృద్ధ్ది పనులు జరుగుతుండడంతో మండపం కింద స్వామివారి కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శనివారం అర్ధరాత్రి తరువాత ఆదివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి కల్యాణానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వం తరపున తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు ఆలయ ఈఓ నవీన్ తెలిపారు.