నల్లగొండ, అక్టోబర్ 14: మైనింగ్ కార్యాలయంలో ఆయనో సెక్షన్ ఆఫీసర్.. కాదు..కాదు..షాడో ఏహెచ్వోడీ. సెక్షన్లో పనిచేసే వారి నుంచి ఏడీ వరకు ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట వినకుంటే అంతే సంగతులు. గత ఏజీ అండదండలతో ఐదేండ్ల నుంచీ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్న ఆయన మొదటి నుంచీ ఉన్నతాధికారులను తన చేతిలో పెట్టుకొని అక్రమ దందాలకు తెరతీశారు. ఇసుక సరఫరాకు కొత్తగా పెట్టే ట్రాక్టర్ల ఎన్రోల్ మెంట్ నుంచి ఇసుక బండ్లు దొరికితే ఎంత ఫైన్ వేయాలి…ఎంత డిపాజిట్ కట్టించాలనే విషయాలపై ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇసుక ఆన్లైన్ చేయకుండా ఎవరైనా దొరికితే వారి నుంచి అడ్డగోలుగా వసూలు.. లేదంటే..తాను జిల్లా కేంద్రంలో నిర్మించే ఆస్పత్రికి సదరు ట్రాక్టర్ ఇసుకను ఉచితంగా తరలించడం చేస్తున్నారట. అంతేకాదు గతంలో బోయవాడలో ఉన్న మైనింగ్ ఆఫీస్‌ను తన ఇంట్లోకి మార్చి, తన కార్లనే ఆఫీసులో అద్దెకు ఉపయోగిస్తూ వచ్చే ప్రతి రూపాయి జేబులో వేసుకొని, సహచర ఉద్యోగులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదనే ఆరోపణలు మైనింగ్ కార్యాలయంలో వినిపిస్తున్నాయి.
ఒక్కో పనికి ఒక్కో రేటు..
మైనింగ్ శాఖలో ఆయన రూటే వేరని కార్యాలయంలో పనిచేస్తున్న కింది ఉద్యోగులతో పాటు ట్రాక్టర్ డైవర్లు అంటున్నారు. కొత్తగా ట్రాక్టర్ కొని మైనింగ్ శాఖలో ఇసుక తోలేందుకు పెట్టుకుంటే రూ.మూడు నుంచి ఐదు వేల వరకు ఇవ్వనిదే ఎన్రోల్ చేయరనేది టాక్. ఇక ఇసుక బండి దొరికితే రూ.ఐదు వేలు ఫైన్ రూపంలో డీడీ చెల్లించాల్సి ఉండగా…సదరు ట్రాక్టర్ డ్రైవర్ తనకు రెండు వేలో, మూడు వేలో ఇస్తే వదిలేయటం..లేదంటే రూ.ఐదు వేల ఫైన్ డీడీతో పాటు రూ.25వేల డిపాజిట్ కట్టించటం ఆయన స్పెషల్ అంటున్నారు. ఇక జేసీబీ దొరికితే డబ్బులు ఇస్తే సరి.. లేదంటే రూ.50 వేల డీడీ, రూ.2లక్షల డిపాజిట్ కట్టాల్సిందే.
ఇంట్లోనే ఆఫీసు..అద్దెకు కార్లు..
గతంలో ఇతర శాఖలో పనిచేసిన ఆయన, ఇటీవల బదిలీపై వెళ్లిన ఏజీ ద్వారా మైనింగ్ కార్యాలయంలో చేరారు. గతంలో బోయవాడలో మైనింగ్ కార్యాలయం ఉండేది. ఇటీవల అక్కడ నుంచి ఆఫీసును తరలించి రాఘవేంద్ర కాలనీలోని తన ఇంట్లోకి మార్చి అద్దె సైతం వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు ఆఫీసులోని ఏడీతో పాటు ఆర్ఐ, ఇతర ఉద్యోగులు ఇసుక బండ్లు పట్టుకోవటానికి వెళ్తే తన సొంత వాహనాలనే వినియోగిస్తూ, ఆ అద్దె కూడా వదలటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇసుక దొరికితే సొంత దవాఖానకే..
ఇసుక అవసరమైన వారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.2950కి వస్తుంది. అయితే ఇందుకు వారం టైం పడుతుండటంతో త్వరగా ఇసుక కావాలనుకునే వారు ఆఫీసుకు వెళ్తే ఆయనే స్వయంగా ఆన్లైన్లో బుక్ చేసి క్వాలిటీ ఇసుక పంపిస్తానంటూ చెప్పి ట్రిప్పుకు వెయ్యి దాక నొక్కేస్తుండటం విశేషం. ఇక ఆన్లైన్లో బుక్ చేసింది కాక, ఆఫ్‌లైన్‌లో నల్లగొండకు వచ్చిన బండి దొరికితే అంతే సంగతులు. ఆ ఇసుకను ఇటీవల తన భాగస్వామితో నల్లగొండలో నిర్మిస్తున్న దవాఖానకు తరలించడమే తరువాయి. వారు మరోసారి దొరికినా వదిలేస్తున్నాడని పలువురు ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు అంటున్నారు.
ఆఫీసుకొచ్చి మాట్లాడు..మైనింగ్ ఏడీ
మైనింగ్ ఆఫీస్‌లో ఓ సెక్షన్ అధికారి చేసే అక్రమాలపై నమస్తే తెలంగాణ విలేకరి మైనింగ్ అధికారిని వివరణ కోరగా ఆఫీ సు ఎక్కడ పెట్టుకుంటే ఏంటి…ఏదైనా కిరాయే కదా అంటూ ఫోన్ కట్ చేశాడు. మళ్లీ కాల్ చేయటంతో నువ్వు ఆఫీసుకు రా..ఆఫీసుకు వచ్చి మాట్లాడు అంటూ సీరియస్‌గా మళ్లీ ఫోన్ కట్ చేశారు.