మిర్యాలగూడ రూరల్, నవంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా మండలంలోని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో అద్దంకి-నార్కట్పల్లి రహదారి వెంట మొక్కలను నాటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని జాగ్రత్తగా కాపాడడంతో ఏపుగా పెరిగి రోడ్డు వెంట పచ్చదనం సంతరించుకుంది. అయితే సదరు మొక్కలు విద్యుత్ తీగలకు తగులుతున్నాయని ట్రాన్స్కో సిబ్బంది ఆదివారం జేసీబీ సాయంతో అడ్డగోలుగా విరిచారు. తాము ఎంతో శ్రద్ధతో మొక్కలను పెంచుతుంటే ట్రాన్స్కో సిబ్బంది కనీసం సమాచారం ఇవ్వకుండా అడ్డగోలుగా నరికేశారని సర్పంచ్ విక్టోరియా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
విషయాన్ని ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీఓ వీరారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఎంపీఓ వీరారెడ్డిని వివరణ కోరగా విషయాన్ని సర్పంచ్ తన దృష్టికి తీసుకొచ్చారని, విద్యుత్ సిబ్బంది ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొక్కలను విరగ్గొట్టారని తెలిపారు. వాటిని పరిశీలించి నివేదిక అందించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిపారు.