సూర్యాపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రొటెక్షన్ ఆఫ్ సెక్సువల్ హెర్రాస్మెంట్ విషయంలో అత్యంత కఠినమైన చట్టం పోష్ యాక్ట్. దీని ద్వారా గత కొంత కాలంగా ఎంతోమంది కీచక ఉద్యోగులు సస్పెండైనా మిగతా వారి తీరు మారడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సందు దొరికితే చాలు ఎలాగైనా లొంగదీసుకునే యత్నాలకు పాల్పడే దుర్మార్గులు ఉన్నారు. తొటి ఉద్యోగినులు, సాయం కోసం వచ్చేవారే టార్గెట్‌గా వారు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటీవల జిల్లా కార్యాలయంలో కారుణ్య నియామకం కోసం వచ్చిన ఓ మహిళ వద్ద డబ్బులు తీసుకోవడంతో పాటు ఆమెపై కన్నేసిన సదరు ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జిల్లా కేంద్రంలోని ఉద్యోగులు గుసగుసలాడారు.
అంతే కాకుండా ఓ కీలక సెక్షన్లో పనిచేసే అధికారి ముఖ్యమైన ఫైల్ దాచి తన కింద పని చేసే ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడట. ఇలాంటి విషయాల్లో గతంలో కఠినంగా వ్యవహరించిన అధికారులకు నేడు ఏమైంది..? జిల్లా పరువు పోతుంది.. బయటకు పొక్కకుండా వెంటనే సెటిల్ చేసుకోవాలని చెప్పడంతో ఇటువంటివి బయటకు రావడంలేదని తెలిసింది. మహిళలు పని చేస్తున్న చోట లైంగిక వేధింపులు నివారించేందుకు 2013లో పోష్ చట్టం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం వేధింపులకు గురి చేసే ఉద్యోగులపై సస్పెన్షన్లతో పాటు పరిహారం చెల్లించడం, బాధితులకు కావాల్సిన చోటకు బదిలీ చేయడం, అలాగే డిప్రెషన్‌కు గురైతే మూడు నెలల వరకు సెలవులు మంజూరు చేసేవారు. ఇటువంటి కఠిన నిబంధనలు ఉన్నా కామాంధుల తీరు మారడం లేదు.
కొద్ది కాలంగా సూర్యాపేట జిల్లాను పరిశీలిస్తే 30కి పైగానే ఇటువంటి సంఘటనలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి రాగా.. మిగతా వాటిని కప్పిపెట్టినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో ఇద్దరు ఏవోలు ఒక ఏఈవోను వేధింపులకు గురి చేయడంతో ఇద్దరు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాగా కోదాడలో కూడా ఇదే శాఖకు చెందిన ఒకరు సస్పెండ్ అయ్యారు. ఒక ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్‌ను వేధింపులకు గురి చేసిన ఎంపీవో సస్పెండ్ అయ్యారు. ఒక డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను వేధించి, సస్పెండ్ కాగా ఆత్మకూర్.ఎస్ మండలంలో ఇదే డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. కీచక పర్వానికి ఒడి గట్టే యత్నం చేసిన డీఆర్డీవోలో ఒకరు సస్పెండ్ కాగా ఓ లేబర్ ఆఫీసర్ సస్పెండ్ కావడం, అనంతరం సస్పెన్షన్‌ను నిలిపివేసి బదిలీ చేశారు. వీటితో పాటు ప్రజల మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసుల రాసలీలలు కూడా తక్కువేం లేవు.
తమ పట్ల ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సదరు ఎస్ఐని సస్పెండ్ చేశారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్ ఇటీవల సస్పెండ్ అయిన విషయం విదితమే. ఇలాంటివి వెలుగులోకి వచ్చినవి చాలా తక్కువే. తాజాగా ఓ అధికారి వద్దకు ఉద్యోగం చేసే భర్త చనిపోవడంతో సదరు మహిళ కారుణ్య నియామకం కోసం వచ్చింది. అయితే సదరు ఉద్యోగి ఉద్యోగం ఇస్తానని రెండు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా పదేపదే కార్యాలయానికి రావాలని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటంతో విసుగు చెందిన సదరు మహిళ బంధువులతో కలిసి వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే ఓ కీలక శాఖకు బాస్‌గా ఉన్న ఓ అధికారి తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగి వద్ద ఉండాల్సిన ముఖ్యమైన ఫైల్‌ను దాచి ఫైల్ కోసం వేధించాడని, ఆ విషయం ఆమె భర్తకు చెప్పడంతో సదరు ఉద్యోగి వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దాడి చేసి చితకబాదారట. ఒంటిమీద గాయాలు ఎలా తగిలాయో చెప్పుకోలేక… తోటి ఉద్యోగిని ముఖం చూడలేక.. పనిభారం ఎక్కువగా ఉందని, తన శాఖను మార్చాలంటూ ఉన్నతాధికారులను వేడుకున్నాడట. ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగులు, ఏదైనా పని కోసం వచ్చే మహిళల పట్ల పురుష ఉద్యోగులు అసభ్యకరంగా ప్రవర్తించకుండా పోష్ యాక్ట్ ఎంత కఠినంగా ఉంటుందో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.