మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 18 : గురుకుల పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15నుంచి 19 వరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్‌లో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో మిర్యాలగూడ ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి సుశాంత్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నాడు.
అక్టోబర్ 18 నుంచి 20 వరకు సదాశివపేటలో జరిగిన అండర్-19 ఎస్టీఎఫ్ కబడ్డీ పోటీల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థి శశికుమార్ బహుమతి సాధించాడు. అదే పాఠశాలకు చెందిన గోపీచంద్ 2022లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్‌లో అండర్-14 విభాగంలో 600 మీటర్లు, 60 మీటర్లు మరియు స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో మొత్తంగా 1620 పాయింట్లు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 2023లో రాష్ట్రస్థాయి పోటీల్లో 600మీటర్ల విభాగంలో ప్రథమ బహుమతి సాధించాడు. 2024 జనవరిలో బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
నేను ఐదో తరగతిలో గురుకుల పాఠశాలలో సీటు సాధించాను. స్కూల్లో మా పీఈటీ సార్ గురువయ్య, పీడీ లక్ష్మణ్ సార్ బాల్ బ్యాడ్మింటన్‌లో మెళకువలు నేర్పించారు. దీంతో పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. 2023 అక్టోబర్‌లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాయ్‌లో జరిగిన పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకున్నా. గురుకులానికి రాకముందు నాకు బాల్ బ్యాడ్మింటన్ అంటే ఏందో తెలియదు. గురుకులాల వల్ల నా లాంటి ఎంతో మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే కాకుండా క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. గురుకులాలు పెట్టిన కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
– సుశాంత్, 9వ తరగతి, మిర్యాలగూడ ఎస్సీ గురుకుల పాఠశాల