రామగిరి, డిసెంబర్ 14 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఆది, సోమవారాల్లో రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు ఆయా జిల్లాల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52,109 మంది అభ్యర్థులు హాజరు కానుండగా.. వారి కోసం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 9:30కు, మధ్యాహ్నం 2:30గంటల వరకు అభ్యర్థులను అనుమతిస్తారు. అరగంట ముందే గేట్లు మూసివేయనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులకు బయోమోట్రిక్ హాజరు తీసుకోనున్నారు.