తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో గ్రూపుల కుంపటి రగులుతున్నది. ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. ముందే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న ఆ పార్టీ నేతలు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారులు, అల్లుడు ఇసుక వ్యాపారం, కాంట్రాక్ట్‌లు, వైన్ షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఐదారు నెలల నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రెస్మీట్లు, సభలు, నిరసనలు తరుచూ చేపడుతున్నారు. తాజాగా మోత్కూరులో వేలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో జరిగిన భారీ అసమ్మతి సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది మండలు ఉండగా.. ఎమ్మెల్యే సామేల్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి అనుచరులు మూడు వర్గాలు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ ఎంపిక ఆగిపోయింది.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఆ పార్టీ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నామనే ఆలోచనతో అంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి సామేల్‌ను గెలిపించుకుంటే ఇప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేవలం ఆయన కుటుంబ సంక్షేమం కోసమే పని చేస్తున్నారని మోత్కూరు కేంద్రంగా జరిగిన సభలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బాహాటంగా ఆరోపణలు చేసింది. తాము కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలు సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కాగా, ఎమ్మెల్యే సామేల్, మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేపై నిరంతరం అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. తట్టెడు ఇసుక కూడా ఎత్తనివ్వనని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచా రం చేసి సామేలు ప్రస్తుతం ఆయన కుమారులతో దందా నడిపిస్తున్నారని కాంగ్రెస్ నాయకులే విమర్శిస్తున్నారు. తుంగతుర్తిలో కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నప్పటికీ అంతకుముందు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. శాలిగౌరారం మండలానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి తనను చితక బాదించారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కూడా అప్పట్లో కలకలం రేపింది. అర్వపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత యోగానందచార్యులు నేతృత్వంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశానికి సిద్ధమవగా, రాత్రికి రాత్రి సొంత పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం వర్గపోరు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.
మోత్కూరులో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వేలాది మందితో నిర్వహించిన సభతో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఈ మీటింగ్ ఎమ్మెల్యే వర్గం దిక్కుతోచని స్థితిలో పడిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు రాజకీయం ప్రాబల్యం కోసం పదవుల పందేరంలో ఒక్కోసారి ఒక్కో ఇద్దరు కలుస్తూ కడుపులో కత్తులు పెట్టుకొని పైకి కౌగిలించుకుంటున్నట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శాలిగౌరారం, మోత్కూరు, తుంగతుర్తి మూడు మార్కెట్ కమిటీల విషయంలో శాలిగౌరారం మార్కెట్ కమిటీని ఎమ్మెల్యే ప్రతిపాదించగా, మంత్రి కోమటిరెడ్డి అనుకూలంగా ఉండడంతో మోత్కూరు మార్కెట్ చైర్మన్ పదవి కోమటిరెడ్డి వర్గానికి దక్కింది. తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఇద్దరికీ అనుచరుడుగా ఉండగా వారు ప్రతిపాదించిన వ్యక్తికే ఎమ్మెల్యే అంగీకరించాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చెప్తున్నాయి. నియోజకవర్గ రాజకీయాలకు కేంద్ర బిందువు అయిన తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ గిరికి మాత్రం ప్రతిష్టంభన నెలకొంది. ఇక్కడ ఒకరిని ఎమ్మెల్యే సామేల్ ప్రతిపాదిస్తుండగా మరొకరిని మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కలిసి చూపించడంతో పెండింగ్‌లో పడింది. పరిస్థితి ఇలాగే ఉంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పతనం తప్పదని ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు.