నల్లగొండ, నవంబర్ 14 : ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై గురువారం ఉదయాదిత్య భవన్లో చీఫ్ సూపరింటెండెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పరీక్షకు రెండ్రోజుల ముందే చేయాల్సిన పనులపై చెక్ లిస్ట్ రూపొందించుకొని షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో వాటిని తప్పకుండా పాటించాలన్నారు. నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వద్దని, ప్రధానంగా ఓఎంఆర్ షీట్లు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణపై ఇన్విజిలేటర్లకు ముందే అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పరీక్ష కేంద్రం వద్ద తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ అమరేందర్, డీఐఓ దస్రు నాయక్, గ్రూప్-3 పరీక్షల రీజనల్ కో ఆర్టినేటర్ డాక్టర్ ఉపేంద్ర, నాగరాజు, వాసుదేవ్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.