నేరేడుచర్ల, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రాయితీలను వెంటనే చెల్లించాలని సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నేరేడుచర్లలోని పెన్షనర్ల భవనంలో నిర్వహించిన సామూహిక జన్మదిన వేడుకలు అలాగే కోదాడలో ఇటీవల నిర్వహించిన పెన్షనర్ల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన జిల్లా క్రీడాకారులను సన్మానించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు డీఏలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు డీఏలు చెల్లించాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వరకు కనీసం రెండు డీఏలు అయినా చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం లేదని, ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించడం లేదన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈహెచ్ఎస్ కార్డుల బిల్లులు చెల్లించకపోవడం వల్ల వైద్య సేవలు అందించడం లేదన్నారు. తక్షణమే ఈహెచ్ఎస్ కార్డులు అందజేసి ఉచిత వైద్య సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వేతనం నుండి ఒక శాతం ప్రభుత్వం మరొక శాతం కలుపుకుని బీమా కంపెనీ సహకారంతో హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వం రెండు నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లిస్తుందని, హైకోర్టుకు వెళ్లిన పెన్షనర్లకు మాత్రం రెండు నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించగా కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కోర్టుకు వెళ్లినా వెళ్లకపోయినా పెన్షనర్లందరికీ ఒకే విధంగా రాయితీలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు వారిపెళ్లి చంద్రశేఖర్ రావు, నేరేడుచర్ల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొతగంటి సత్యనారాయణ, కోశాధికారి బండి బుద్ధారెడ్డి, నేరేడుచర్ల. హుజూర్నగర్ సంఘాల అసోసియేట్ అధ్యక్షులు చావా వీరభద్రరావు, ఎం ఎస్ ఎన్ రాజు, హుజూర్నగర్ సంఘం అధ్యక్షుడు చెన్న సోమయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పుల వీరారెడ్డి, భవన నిర్మాణ కమిటీ కోశాధికారి ఉప్పల లక్ష్మారెడ్డి, పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, బొడ్డుపల్లి సుందరయ్య, సుభాష్ చంద్రబోస్, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.