– రూ.వెయ్యి కోట్లు ఎవరికీ ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి
– బకాయిల సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య
కోదాడ, మే 01 : 2024 మార్చి నుండి రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.1,000 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఇది పెన్షనర్లను మోసం చేయడమేనని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, 2024 బకాయిల సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. 2025 అక్టోబర్ వరకు జీపీఎఫ్, పీఆర్సీ ఏరియర్స్, జీఐఎస్, టీఎస్జీఎల్ఐ చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసి పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.
ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఎవరికి ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరవై ఏళ్లు దాటిన ఉద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా, నిరాహార దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భావ్‌సింగ్, నాగేశ్వరరావు, రమేష్ బాబు, భిక్షం, మణిరాం, లక్ష్మీనరసయ్య, హుస్సేన్, కోటయ్య, జాఫర్, దస్తగిరి పాల్గొన్నారు.