తుర్కపల్లి, ఆగస్టు 5 : గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని, ఈ ప్రాంత ప్రజలకు సాగు నీటి కష్టాలు తొలుగుతాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని మాదాపురం గ్రామంలో ఆయన సోమవారం స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గంధమల్ల గ్రామంలోని గంధమల్ల చెరువును పరిశీలించారు.
ఆ తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే 1.04 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 240ఎకరాల భూమిని సేకరించిందని, రిజర్వాయర్ నిర్మాణానికి పోగా మిగిలిన స్థలాన్ని నిర్వాసిత రైతులకు భూమికి భూమి, పరిహరం అందించేందుకు కృషి చేస్తామని బీర్ల అయిలయ్య తెలిపారు. గంధమల్ల ప్రజల ఇండ్లకు నష్టం వాటిల్లకుండా రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణంలో తక్కువ నష్టంతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. వారంరోజుల్లోగా ఇరిగేషన్‌శాఖ అధికారులు రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమా, ఆర్డీఓ అమరేందర్, జడ్పీసీఈఓ శోభారాణి, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాస్, ఈఈ రఘనాథ ప్రసాద్, డీఈ శైలేందర్, తాసీల్దార్ దేశియా, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మీబాయి, కాంగ్రెస్ మండల వర్కింగ్‌ప్రెసిడెంట్ భాస్కర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్‌నాయక్, కొమిరిశట్టి నర్సింహులు, రాజయ్య పాల్గొన్నారు.