ఆత్మకూరు(ఎం), మే14 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ భారమవుతున్నదని, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆత్మకూరు(ఎం) గ్రామ పంచాయతీ కార్యదర్శి తుమ్మల ఆనంద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ 14నెలల నుంచి గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం తాను స్వయంగా అప్పు చేసి రూ.9లక్షలు ఖర్చు చేశానని తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో 1400 ఇండ్లు, 5,300 మంది జనాభా ఉన్నారని చెప్పారు. పంచాయతీలో నిధులు లేకపోవడంతో మండల స్థాయి అధికారుల ఆదేశాల మేరకు అప్పుచేసి తెచ్చిన డబ్బులతో గ్రామంలో పైపు లైన్, పరిశుభ్రత పనులు, చెత్త సేకరణ ట్రాక్టర్ కోసం డీజిల్, వీధిలైట్లు, ఇతర అవసరాల కోసం ఖర్చు చేశామని తెలిపారు. ఆర్థిక భారంతోపాటు పనిభారం ఎక్కువ కావడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేయాలని, తాను సొంతంగా ఖర్చు చేసిన డబ్బులు కూడా ఇవ్వాలని కోరారు.