సూర్యాపేట టౌన్, జూలై 5 : ప్రతిఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకొని, పోటీ తత్వంతో విజయ శిఖరాలు చేరాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేటలో 15 రోజులుగా జరుగుతున్న జీజేఆర్ క్రికెట్ లీగ్(ఎస్‌సీపీఎల్) శనివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుత రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే క్రీడలకు దగ్గరగా చేయాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీసి వారికి ఏ క్రీడల్లో ప్రతిభ ఉం టే ఆ క్రీడల్లో తర్ఫీదు ఇప్పించి ప్రోత్సహించాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. చెడు వ్యసనాల బారిన పడకుండా యువతకు క్రీడలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి రాష్ర్టానికి, జిల్లాకు, పట్టణానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు.
ఓటమి గెలుపునకు పునాది అని ఓడిన వారు నిరాశ పడకుండా గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రథమ బహుమతి పొందిన ఆర్జేఈ(రాజేశ్ ఎలక్ట్రికల్స్) టీమ్‌కు రూ.లక్షతో పాటు షీల్డ్, ద్వితీయ బహుమతి పొంది ఎస్ఆర్సీ(సీతారామ కన్వెన్షన్)కు రూ.50వేలతో పాటు షీల్డు, తృతీయ బహుమతి పొందిన సిటీ టాలెంట్ స్కూల్ బాయ్స్‌కు రూ.30వేలు, షీల్డ్‌ను క్రీడాకారులకు అందజేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్ట కిశోర్, డాక్టర్ సుధీర్‌కుమార్, నాయకులు డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, గుర్రం సత్యనారాయణరెడ్డి, తాహేర్ పాషా, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, వెన్న రవితేజరెడ్డి, చైర్పర్సన్ అన్నపగుర్రం సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.