Devarakonda Fort | రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. సుమారు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఖిల్లా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్నది. ఈ ఖిల్లాకు స్వరాష్ట్రంలోనే గుర్తింపు వచ్చింది. దీన్ని పర్యాటకంగా తిర్చిదిద్దాలని కేసీఆర్ సర్కారు సంకల్పించింది. ఆ మేరకు సీసీ రోడ్లు, పార్కుల ఏర్పాటుకు రూ.6కోట్లు మంజూరు చేయగా.. పనులు కొనసాగుతున్నాయి.
దేవరకొండ ఖిలా కొండపైన ప్రతి సంవత్సరం శివరాత్రి, ఏకాదశికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దేవరకొండ ఖిలాను చూసేందుకు సమీప ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం వస్తుంటారు. ఖిలా కొండపైన ఓంకారేశ్వర్ శివాలయం ఉన్నది. ఆ ఆలయానికి ఉత్తర భాగాన ఉన్న కోనేరులో నీళ్లు కొబ్బరి నీళ్లలా కనిపిస్తాయి. ఆ నీళ్లు తాగితే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. ఏ కాలంలోనైనా కోనేరు ఎండిపోదని అక్కడి వారు చెప్తుంటారు. దేవరకొండ ఖిలాలోకి ప్రవేశించేటప్పుడు రెండు సింహ ద్వారాలు ఉంటాయి. వాటిని దాటి కోటలోకి వెళ్లగానే రేచర్ల వెలమవీరులు ఉపయోగించిన ఫిరంగులు దర్శనమిస్తాయి.
ఈ విశాలమైన ప్రదేశంలో గండిపేట నీటిని తలపించేలా రెండు నీటి బావులు, రెండు కుంటలు ఉంటాయి. వాటిని ఖిలాకు కాపలా ఉండే సైన్యం తాగునీటి కోసం పయోగించేవారు. ఈ ప్రాంగణంలోనే లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, మూడు ధాన్యాగారాలు ఉన్నాయి. మూడు స్వింహద్వారాలు దాటి ఖిలాపైకి వెళ్తే రాజ్య చిహ్నమైన ధర్మచక్రం, దానికి రెండు వైపులా సింహాలు చెక్కి ఉన్నాయి. ఈ మూడు సింహద్వారాల్లో మొదటి ద్వారానికి జలచరమైన తాబేలు బొమ్మ చెక్కి ఉన్నది. మరో సింహద్వారంలో అరుగులపై సిపాయిలు ఆడుకోవడానికి పచ్చిస్, ఆటల నమూనాలు చెక్కి ఉన్నాయి. ఖిలా కోట చుట్టూ సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచేందుకు 32 చిన్న ద్వారాలు ఉన్నాయి.
హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండ ఖిలాకు 700 ఏండ్ల చరిత్ర ఉన్నట్లు పురాతన కట్టడాలను పట్టి తెలుస్తున్నది. దేవరకొండ చుట్టూ సుమారు 524 ఎకరాల్లో కొండలు, గుట్టలు, మైదానం ప్రాంతాల్లో ఈ దుర్గం విస్తరించి ఉన్నట్లు పురావస్తు శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. ఏడు కొండలను కలుపుతూ దుర్గంగా ఏర్పడిన దేవరకొండ ఖిలాను వెలమ రాజులు పరిపాలించినట్లు చరిత్ర తెలుపుతుంది. క్రీ.శ. 1361 సంవత్సరంలో అనపోత యాదా నాయకులు రాచకొండ, దేవరకొండ దుర్గాలు నిర్మించి ప్రభువులు అయ్యారు.
క్రీ.శ. 1361 నుంచి 1384 వరకు యాదానాయకుడు దేవరకొండ ఖిలా అధిపతిగా కొనసాగారు. 1384 నుంచి 1399 వరకు దేవరకొండ కోటను రెండో అనపోత నాయకుడు పరిపాలించారు. 1421 నుంచి 1430 వరకు అనపోతనేని రెండో సోదరుడు పరిపాలించాడు. 1430 నుంచి 1475 వరకు దేవరకొండ ఖిలాను పరిపాలించిన చివరి రాజు లింగనేడు. అ తర్వాత 1482లో తక్కువ కాలం అంగనేడు దేవరకొండ ఖిలాను పరిపాలించాడు. దేవరకొండ దుర్గాన్ని యాదా నాయకుడు, మాధవరావు, పర్వత్‌రావు, నేహద్రిరావు, ధర్మారావు, లక్ష్మణ్‌రావు అనే రాజులు పరిపాలించారు. హైదరాబాద్ నవాబు దేవరకొండ కోటను సందర్శించి ఆకర్షితుడయ్యాడు. 16వ శతాబ్దంలో కులీ కుతుబ్‌షా ఈ దుర్గాన్ని ముట్టడించి దేవాలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. సీసీ రోడ్లు, పార్కుల ఏర్పాటుకు సుమారు రూ.6 కోట్లు మంజూరు చేశారు. ఖిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసే పార్కులో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరినీ ఆహ్లాదపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5ఎకరాల్లో లైబ్రరీ, ఓపెన్ ఆడిటోరియం, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఫౌంటెయిన్తోపాటు సేద తీరేందుకు పచ్చని గడ్డి, వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.