చిట్యాల, ఆగస్టు 30 : చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేను శుక్రవారం ఉద యం ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేశాయి. ఏం జరిగిందో తెలియని భయానక పరిస్థితి. పక్కనే శ్రీపతి ల్యాబ్ నుంచి ఆ పొగలు కమ్ముకొస్తున్నాయి. కంపెనీలో రియాక్టర్ పేలిందని, రియాక్టర్లో గ్యాస్ లీక్ అయ్యిందని, రసాయన డ్రమ్ముల ద్వారా ప్రమాదం జరిగిందని నానా రకా ల ప్రచారాలు జరిగాయి. కంపెనీలో పనిచేసే కార్మికులు భయంతో పరుగులు తీయడంతోపాటు స్థానికులు కూ డా భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో గల శ్రీపతి ల్యాబ్‌లోని క్యూ 3లో శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత అకస్మాత్తుగా మంటలు లేచి పొగ కమ్ముకుంది. కెమికల్ కంపెనీ కావడంతో సమీపంలోని గ్రామ ప్రజలు భయపడ్డారు. చిట్యాల పోలీసులు కంపెనీ వద్దకు చేరుకొని రామన్నపేట, చౌటుప్పల్ నుంచి అగ్నిమాపక వాహనాలను పిలిపించి రక్షణ చర్యలకు పూనుకున్నారు.
రియాక్టర్లో గ్యాస్ లీకేజీ కారణంగా పొగలు వ్యాపించినట్లు తెలుస్తున్నప్పటికీ, ఘటన ఎలా జరిగిందనే దానిపై స్పష్టత లేదు. పో లీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు. కంపెనీ ప్రతినిధులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. కాగా, కంపెనీలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తున్నది.