నీలగిరి, మార్చి 6 : జాతీయ రహదారుల వెంట పార్కింగ్ చేసిన లారీల నుంచి డీజిల్ చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.6లక్షల నగదు, 4 వాహనాలు, 700 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల తరుచూ డీజిల్ దొంగతనం జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆర్టీఏ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఇన్నోవా వాహనాల్లో ఆరుగురు ఆంధ్రా వైపు వెళ్తున్నారు. అనుమానం వచ్చి వారిని తనిఖీ చేశారు. అందులో డీజిల్ క్యాన్లు, పైపులు ఇతర సామగ్రి ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పలు అసక్తికర విషయాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా బొల్లేపల్లి మండలం సీతారాంపురం తండాకు చెందిన బానోవత్ బాల బద్దునాయక్ అలియాస్ బాలూనాయక్, బానోవత్ గోవింద్‌నాయక్, మేరజుత్ శ్రీను నాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, మేరజుత్ బాబ్రీనాయక్, నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వడ్త్య రాజునాయక్ స్నేహితులు. వీరంతా డబ్బును సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనాల్లో డీజిల్ దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కలిసి పల్నాడు జిల్లా నుంచి మూడు ఇన్నోవాలు, జైలో వాహనాల్లో రాత్రి సమయంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని హైవేల వెంట పార్ చేసిన లారీలను టార్గెట్ చేసేవారు. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండే విషయాన్ని గమనించి లారీ డీజిల్ ట్యాంక్ తాళాలు పగులగొట్టి గానీ లేదా స్రూలు తీసి గానీ పైప్ సాయంతో డీజిల్‌ను క్యాన్లలో నింపుకొని ఇన్నోవా, జైలో వాహనాల్లో ఏపీకి తీసుకెళ్లి అమ్ముకునేవారు. వీరిపై జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదయ్యాయి. కాగా, నెల రోజులుగా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన నేనావత్ టాకూనాయక్ అలియాస్ ఠాగూర్ వీరి వద్ద నుంచి సుమారు 1,500 లీటర్ల డీజిల్‌ను తకువ ధరకు కొనుగోలు చేశాడు. నిందితుల సమాచారం మేరకు ఠాగూర్ నుంచి 700 లీటర్ల డిజిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఠాగూర్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన మిర్యాలగూడ సీఐ కె.వీరబాబు, వాడపల్లి ఎస్ఐ రవి, సిబ్బందిని ఆయన అభినందించారు.