నీలగిరి, ఆగస్టు 16 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ మండలంలో ఉత్సవ నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు సూచించారు. శనివారం సాయంత్రం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ మండలంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ముందస్తు అనుమతి తీసుకుంటే మానిటరింగ్ చేయడం సులభం అవుతుందన్నారు. కావునా ప్రతి మండప నిర్వాహకులు పోర్టల్లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.
ఇందుకోసం https://policeportal.tspolice.gov.in/index.htm కి లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి డీజేలకు అనుమతులు లేనందున నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని, సందేహాలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతవరణంలో, ఆనందోత్సవాల మద్య శాంతియుతంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.