లక్షల విలువ చేసే భూములు.. పచ్చని సాగు పొలాలు.. రైతులకు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు.. కానీ, సర్కారు మాత్రం అడ్డికి పావుశేరు లెక్క తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నది. గంధమల్ల రిజర్వాయర్ పేరుతో అరకొర పరిహారం అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అయితే తమకు సరైన న్యాయం చేసే దాకా విలువైన భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తేల్చి చెబుతుండటంతో కొత్త చిక్కు ఎదురైంది. ఇటీవల రైతులతో జరిగిన చర్చల్లోనూ సయోధ్య కుదరకపోవడంతో మరోసారి భేటీ కానున్నారు.
యాదాద్రి భువనగిరి, మే 30 (నమస్తే తెలంగాణ)/తుర్కపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-15లో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. కానీ, వివిధ కారణాలతో ముందుకు సాగలేదు. 9.36 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని మొదట నిర్ణయించారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 4.28 టీఎంసీలకు కుదించారు. అయినా ముంపు గ్రామాల ప్రజలు ప్రతిఘటించడంతో 1.41 టీఎంసీలకు తగ్గించారు. రిజర్వాయర్ ప్రారంభంలో రూ.860 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించగా.. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో రూ.575 కోట్లకు పరిమితమైంది. రిజర్వాయర్ పూర్తయితే 58,687 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది.
గంధమల్ల రిజర్వాయర్‌లో భాగంగా గంధమల్ల, వీరారెడ్డిపల్లి గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. గంధమల్లలో 612 ఎకరాలు, వీరారెడ్డిపల్లిలో 252 ఎకరాల చొప్పున 547 మంది రైతులు 994 ఎకరాలు కోల్పోనున్నారు. 2 కి.మీ. పొడవునా కట్ట నిర్మాణానికి 112 ఎకరాలను గంధమల్లలో సేకరించనున్నారు. అయితే, ఇటీవల భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. మార్కెట్ ధర, గత మూడేండ్ల రిజిస్ట్రేషన్ ధరలు బేరీజు వేసి పరిహారం అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. తుర్కపల్లి.. అటు హైదరాబాద్, ఇటు యాదగిరిగుట్టకు దగ్గరగా ఉండటంతో భూములకు మంచి డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఎకరాకు రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు పలుకుతున్నది. అయితే, భూసేకరణకు సంబంధించి ఇటీవల అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి రైతులతో ఓ దఫా సమావేశమై పరిహారంపై చర్చలు జరిపారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం 2023 భూసేకరణ ఆర్ఎఫ్సీటీ కింద ఎకరాకు రూ.11 లక్షల పరిహారం చెల్లిస్తామని స్పష్టంచేశారు. దీనికి రైతులు ససేమిరా అంటూ.. విలువైన భూములు అంత తక్కువ ధరకు ఎలా ఇస్తామని వ్యతిరేకించారు. మరోసారి రైతులతో చర్చించనున్నారు.
తమ విలువైన భూములు పోతుండటంతో రైతులు కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అంతేకాకుండా భూములు కోల్పోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో భూమికి భూమి ఇవ్వాలని తేల్చిచెబుతున్నారు. అధికారులు మాత్రం పరిహారాన్ని కొద్దిమేర పెంచి ఒప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, జూన్ 6న సీఎం రేవంత్‌రెడ్డి గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ఇస్తున్నట్లు గంధమల్ల రిజర్వాయర్ భూనిర్వాసితులకు సైతం ప్రభుత్వం ఎకరాకు రూ.40 లక్షలు చెల్లించాలి. అధికారులు ఎకరానికి రూ.11 లక్షలు చెల్లిస్తామనడం సరికాదు. ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు పలుకుతున్నది. దానికి అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలి. లేకుంటే భూములు ఇచ్చేది లేదు.
– అనుముల వెంకట్‌రెడ్డి, గంధమల్ల
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతే తామంతా రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. మా భూములు తీసుకుంటే పరిహారం చెల్లించడంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. లేదంటే భూమికి సమానంగా భూమి ఇవ్వాల్సిందే. ప్రభుత్వం పునరాలోచించి తమకు సరైన న్యాయంచేయాలి. పరిహారంలో తేడా వస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం.
– గడిపే ఇస్తారి, భూ నిర్వాసిత రైతు, గంధమల్ల