యాదాద్రి, ఆగస్టు 23 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో గజవాహన సేవను మంగళవారం అత్యంత వైభవంగా జరిపారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణతంతును వీక్షించారు.
తెల్లవారుజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి తిరువారాధన చేపట్టి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్ర నామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. శ్రావణమాసం సందర్భంగా యాదాద్రిలో నిర్వహిస్తున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన కనులపండువగా సాగుతున్నది. 27వ రోజులో భాగంగా అమ్మవారి సహస్రనామాలు పఠించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంప్లెక్స్‌లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని 20 వేల మంది దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ.25,40,717 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న రామానుజ కూటం పీఠవాసులు
లక్ష్మీనరసింహస్వామిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంత రామానుజ కూటం పీఠ వాసులైన యువరాజ్ స్వామి మాధవ ప్రపన్నాచార్య స్వామి తన శిష్య బృందంతో దర్శించుకున్నారు. ప్రసాద్ దాలియా ఆధ్వర్యంలో వరంగల్‌లో భాగవతం సప్తాహ కార్యక్రమం సందర్భంగా యాదాద్రికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.