– రూ.6.77 కోట్ల విలువైన ఆస్తి, కార్లు, ఫోన్లు స్వాధీనం
– దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ మౌనిక వివరాల వెల్లడి
కొండమల్లేపల్లి, అక్టోబర్ 17 : అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. అధిక వడ్డీ వ్యాపారంలో బాలాజీ నాయక్‌కు ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, అమాయకులను నమ్మించి మోసగించిన కేసులో పెద్ద అడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్ వినోద్, సురేశ్, చిరంజీవి, రమేశ్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి రూ.6 కోట్ల 77 లక్షల విలువైన ఆస్తిని, కార్లు, మొబైల్ ఫొన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2,508 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధిక వడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఏఎస్పీ వెల్లడించారు. అరెస్టు చేసిన వారి ఆస్తులను జప్తు చేసి, కోర్టు ద్వారా బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు. బాధితులు ఇతర మార్గాల్లో వెళ్లి మోసపోవద్దని సూచించారు.